హీరోల్లో ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చిట్టా తీస్తే అందులో రానా ప్రముఖంగా కనిపిస్తాడు. పైగా మనోడు తరచుగా ప్రేమ వ్యవహారాలతోనూ వార్తల్లో కనిపిస్తుంటాడు. అలాంటి కథానాయకుడు ఉన్నట్టుండి పెళ్లి పీటలపై దర్శనమిస్తే ఎలా అర్థం చేసుకోవాలి. ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకొన్నాడా ఏంటి? అనే అనుమానం కలగదూ! సోమవారం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో రానా పెళ్లి ఫొటోలు చూసినవాళ్లంతా అదే రకమైన షాక్‌కి గురయ్యారు. రానా ఏంటి? ఇంత సడన్‌గా పెళ్లి పీటలు ఎక్కడమేంటి? అని వండర్ అవుతూ ఆరా తీశారు. తీరా చూస్తే ఆ ఫొటో `బెంగుళూరు డేస్` రీమేక్ సినిమా చిత్రీకరిస్తున్నప్పుడు తీసిందని తెలిసింది. రానా ప్రస్తుతం తమిళంలో `బెంగుళూరు డేస్` రీమేక్‌లో నటిస్తున్నాడు. అందులో పెళ్లి నేపథ్యంలో కొన్ని సన్నివేశాలున్నాయట. వాటిని సోమవారం చిత్రీకరించారు. `నేను తొలిసారి పెళ్లి సన్నివేశంలో నటించా` అంటూ ఫొటో పెట్టి ట్వీట్ చేశాడు రానా. అదలా వైరల్ అయ్యిందన్నమాట.