చిత్రసీమలో సక్సెస్‌కి ఉన్నంత క్రేజ్ మరే విషయానికీ ఉండదు. ఒక్క సినిమా విజయం సాధిస్తే చాలు... ఊరంతా బంధువులే అన్నట్టు పరిశ్రమ అంతా మీదపడి పలకరించేస్తుంది. లారెన్స్ మాస్టర్ విషయంలోనూ ఇటీవల అదే జరిగింది. ఆయన తీసిన `కాంచన2` తమిళంలో ఘన విజయం సాధించింది. ఆ చిత్రాన్ని లారెన్స్ తీసిన విధానం, ఆయన నటన అందరినీ ఆకట్టుకొంది. దీంతో రజనీకాంత్ మొదలుకొని తమిళ పరిశ్రమ ప్రముఖులు మొత్తం లారెన్స్‌కి ఫోన్ చేసి అభినందించారట. రజనీకాంత్ అయితే లారెన్స్‌తో సుధీర్ఘంగా మాట్లాడట. మాస్టర్ మీ నటన అదుర్స్ అంటూ సినిమాలోని ప్రతీ విషయం గురించీ ప్రస్తావించాడట. ఆ మాటలు విన్న లారెన్స్ ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. పనిలో పనిగా ఆయన తన మనసులో మాటని కూడా ఆయన ముందు బయట పెట్టాడట. ఎప్పటికైనా రజనీకాంత్‌తో ఓ సినిమా చేయాలనేది లారెన్స్ కోరిక. అదే విషయాన్ని రజనీకాంత్‌తో చెప్పేశాడట. `ఓ... అదెంత విషయం, చేద్దాం` అని ప్రతిస్పందించాడట రజనీ. అంటే త్వరలోనే రజనీకాంత్-లారెన్స్ కలయికలో ఓ చిత్రాన్ని చూడొచ్చన్నమాట.