'లింగ' తర్వాత రజనీకాంత్ చేయబోయే సినిమా ఎలా ఉంటుంది? దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే చర్చకు బుధవారం తెర పడింది. చాలామంది ఊహించినట్లుగా ఆయన కేయస్ రవికుమార్ తోనో, శంకర్ తోనో.. ఇలా పెద్ద దర్శకులతో
సినిమా చేయడంలేదు. కేవలం రెండే రెండు చిత్రాల అనుభవం ఉన్న రంజిత్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రజనీకాంత్ పచ్చజెండా ఊపారు. రజనీకాంత్ కు 'సూపర్ స్టార్' అనే బిరుదు ఇచ్చిన అగ్ర నిర్మాత కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. థాను సమర్పణలో వి క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది.
కలైపులి థాను నిర్మించిన తొలి చిత్రం 'యార్'లో రజనీకాంత్ అతిథి పాత్ర చేశారు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆయనతో నిర్మించనున్న తాజా చిత్రం గురించి కలైపులి థాను మాట్లాడుతూ - ''రజనీ స్థాయికి తగ్గ కథతో ఈ చిత్రం ఉంటుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం. ఇప్పటివరకు మా సంస్థలో పలు భారీ చిత్రాలు నిర్మించాం. రజనీతో సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాం.'అట్టకత్తి', 'మద్రాస్' చిత్రాల ద్వారా దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు రంజిత్. కథ, ఆయన దర్శకత్వ ప్రతిభను నమ్మి, రజనీ ఈ అవకాశం ఇచ్చారు. అతి త్వరలోనే చిత్రీకరణ మొదలవుతుంది. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అని చెప్పారు.