ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ నటించనున్న కొత్త చిత్రానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. యువ దర్శకుడు రంజిత్ చెప్పిన కథకు పచ్చజెండా ఊపేసిన రజనీకాంత్ తన పక్కన నటించబోయే కథానాయిక గురించి సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కథానాయిక ఎంపిక పూర్తవ్వగానే సినిమాని సెట్స్‌పైకి తీసుకెళతారట. విశ్వసనీయ సమాచారం మేరకు... నయనతారకే రజనీకాంత్ ఓటేశారని సమాచారం. `లింగా`లో అనుష్క, సోనాక్షిలాంటి కథానాయిలకతో నటించాడు. ఇక తన వయసుకు తగ్గట్టుగా కనిపించాలంటే నయనతార మేలని రజనీకాంత్ భావిస్తున్నారట. ఆ మేరకు చిత్రబృందం నయన్‌ని సంప్రదించే ప్రయత్నంలో ఉందని తెలుస్తోంది. రజనీకాంత్-నయనతార కలిసి ఇదివరకు `చంద్రముఖి`, `కథానాయకుడు`లాంటి చిత్రాల్లో నటించారు. అన్నీ కుదిరితే ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్‌ని తెరపై చూడబోతున్నామన్నమాట.