మహేష్‌బాబు సినిమా వ్యాపారం మొదలైంది. చిత్రీకరణ చివరి దశకు చేరుతుండడం, ఈనెల 31న టీజర్ విడుదలకి ముహూర్తం పెట్టడంతో వ్యాపార వర్గాల్లో కదలిక మొదలైంది. సినిమాని కొనేందుకు బయ్యర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు. సక్సెస్, ఫెయిల్యూర్‌లతో సంబంధం లేకుండా మహేష్ సినిమాలకి ఎప్పుడూ భారీ క్రేజ్ ఉంటుంది. అందుకే ‘1’, ‘ఆగడు’ ఫ్లాప్ అయినప్పటికీ ’శ్రీమంతుడు’పై అంచనాలు తగ్గలేదు. దీంతో వ్యాపార వర్గాలు ‘శ్రీమంతుడు’పై ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నాయి. తాజాగా శాటిలైట్ వ్యాపారం కూడా పూర్తయింది. ఛానల్స్ పోటీపడి శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకోవాలని చూశాయి. అయితే జీ తెలుగు ఛానల్ రూ: 11కోట్లు వెచ్చించి శాటిలైట్ రైట్స్‌ని చేజిక్కించుకొన్నట్టు సమాచారం.
ఇంకా టీజర్ కూడా విడుదల కాకమునుపే ఈ రేంజిలో శాటిలైట్ వ్యాపారం జరిగిపోవడం పరిశ్రమ వర్గాల్ని ఆసక్తికి గురిచేస్తోంది. మామూలుగా టీజర్ విడుదలయ్యాకో లేదంటే ట్రైలర్‌ని చూసో ఆ సినిమాని కొనేందుకు ముందుకొస్తుంటాయి వ్యాపారవర్గాలు. అయితే ‘శ్రీమంతుడు’కి సంబంధించి ఇప్పటిదాకా కనీసం ఒక్క స్టిల్లు కూడా బయటికి రాలేదు. అయినప్పటికీ వ్యాపారవర్గాలు సినిమాపై ఓ రేంజ్‌లో నమ్మకం పెంచుకొన్నాయి. మహేష్‌కి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ, ‘మిర్చి’ తర్వాత కొరటాల శివ తీస్తున్న సినిమా కావడం మూలాన వ్యాపారం ఇలా జరుగుతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.