సంపూర్నేష్ బాబు, సనమ్ జంటగా డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన సినిమా 'సింగం123'. ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మంగళవారం హైదరాబాద్ లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు, మోహన్ బాబు, డైరెక్టర్ అక్షత్ అజయ్ శర్మ, డైమండ్ రత్నం, మ్యూజిక్ డైరెక్టర్ శేషు , సంపూర్నేష్ బాబు, పృథ్వి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహన్ బాబు చిత్ర బృందానికి షీల్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ "తెలంగాణా కోసం పోరాడిన అమరవీరులకు తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక హీరో మరొక హీరోను, ఒక దర్శకుడు మరో దర్శకుడిని ప్రోత్సహించడం చాలా కష్టంగా భావిస్తున్నారు. అలా ప్రోత్సహించే వ్యక్తులు అతి తక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కథను సిద్ధం చేసుకొని దానిని ఇతర భాషలలో అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారు. అలాంటిది విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థను నిర్మించి ఎందరో టెక్నీషియన్స్ కు హీరోలకు అవకాశాలిస్తూ అందరిని ప్రోత్సహిస్తున్నాడు. మొదట సంపూర్నేష్ బాబు ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను అని విష్ణు నాకు చెప్పగానే నువ్వే నటించు వేరే వాళ్ళతో ఎందుకు చేయడం అని చెప్పాను. కాని విష్ణు సంపూర్నేష్ తోనే చేస్తానని చెప్పగా కాదనలేకపోయాను. ఈ సినిమాను నేను చూసినప్పుడు సంపూర్నేష్ లో ఇంత మంచి నటుడు ఉన్నాడా అనుకున్నాను. ప్రతి సన్నివేశంలో అధ్బుతంగా నటించాడు. కళల పట్ల ఆసక్తిగల అక్షత్ ను డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. డైమండ్ రత్నం మంచి డైలాగ్స్ అందించాడు. మంచి రచయిత. మా బ్యానర్ లో వచ్చే నాలుగో సినిమా ఇది. ఈ చిత్రంతో అందరికి మంచి పేరు రావాలని, విష్ణు నిర్మాతగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.