స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి హీరోగా 'దండకారణ్యం' అనే చిత్రం త్వరలో తెరకెక్కనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో శనివారం ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "నా బ్యానర్ లో వస్తున్న 28వ చిత్రమిది. త్రేతాయుగంలో సీతారాములను, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం కలియుగంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ చిత్రంలో అరణ్యంలో నివసించే ఆదివాశీయులతో మమేకమయ్యే ఉద్యమకారుని పాత్ర పోషిస్తున్నాను. అరణ్యమనేది తుపాకి రాజ్యం కాకూడదని శాంతి కోసం పోరాటం సాగించడమే ఈ సినిమా. ఇందులో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. గద్దర్, కాశిపతి, జయరాజ్ వంటి ప్రజాకవులు ఈ సినిమాకు సాహిత్యం అందించారు. వైజాగ్, విజయనగరం, బొబ్బిలి, నర్సీపట్నం వంటి ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించనున్నాం. అక్కడున్న స్థానికులలో కొంతమందిని నటీనటులుగా ఎంపిక చేసుకుంటాను. అనుకున్న సమయానికి చిత్రీకరణ పూర్తయితే డిసెంబర్ 25న క్రిస్టమస్ సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.