ఇటీవలే ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకొన్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘భీమవరం టాకీస్’ తాజాగా మరో సూపర్‌హిట్ తమిళ చిత్రం తెలుగు అనువాద హక్కుల్ని కైవసం చేసుకొంది. ‘పసంగ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై.. ‘గోలిసోడా’ వంటి పలు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చి.. తమిళంలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా వెలుగొందుతున్న పాండీరాజ్ దర్శకత్వంలో రూపొంది.. భారీ విజయం సొంతం చేసుకొన్న'కేడి బిల్లా-కిలాడి రంగా' చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. విమల్, శివకార్తికేయన్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు కావడం ఒక విశేషం కాగా.. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం యువన్ శంకర్‌రాజా సంగీత దర్శకుడు కావడం మరో ముఖ్య విశేషం. ఈ సందర్భంగా భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..‘పసంగ, మెరీనా, గోలీసోడా’ వంటి పలు సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన యువ ప్రతిభాశాలి పాండీరాజ్ దర్శకత్వంలో రూపొంది తమిళంలో సంచలన విజయం సాధించిన 'కేడి బిల్లా-కిలాడి రంగా' చిత్రం తెలుగు హక్కుల కోసం చాలామంది పోటీ పడినప్పటికీ.. ఈ చిత్రం హక్కులు మాకు దక్కడం చాలా గర్వంగా భావిస్తున్నాం. పలు అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన విమల్, శివకార్తికేయన్ నటన, రెజీనా, బిందుమాధవి గ్లామర్, యువన్ శంకర్‌రాజా సంగీతం, పాండీరాజ్ దర్శకత్వ ప్రతిభ 'కేడి బిల్లా-కిలాడి రంగా' చిత్రానికి ప్రధాన ఆకర్షణలు. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం’ అన్నారు. సూరి, ఢిల్లీ గణేష్, సుజాత, సందిని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: విజయ్, మ్యూజిక్: యువన్‌శంకర్‌రాజా, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండీరాజ్!!