బేబీ ప్రేమ, క్రిష్, ఈషా ప్రధాన పాత్రల్లో సత్యరావు సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్.ఫణీంద్ర దర్శకత్వంలో సత్యరావు కడగాన నిర్మిస్తున్న సినిమా 'feb 14' బ్రీత్ హౌస్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఆడియో లాంచ్ శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రసమయి బాలకిషన్ బిగ్ సిడీను ఆవిష్కరించారు. ప్రవీణ్ రెడ్డి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సినిమా ఆడియో 'e3' మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా..
నిర్మాత సత్యరావు కడగాన మాట్లాడుతూ "పెళ్ళైన తరువాత గర్భవతి అయిన భార్యతో తన భర్త ఎలా ప్రవర్తిస్తాడనేదే ఈ సినిమా. ఇదొక సందేశాత్మక చిత్రం. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాం. త్వరలోనే సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.
దర్శకుడు ఫణీంద్ర మాట్లాడుతూ "అందమైన ప్రేమకథ, భయపడే సన్నివేశాలు ఈ సినిమాలో ఉంటాయి. అందుకే ఇలాంటి టైటిల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతగానో సహకరించారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
రామసత్యనారాయణ మాట్లాడుతూ "ఓ ప్రేమకథకు హారర్ ఎలిమెంట్స్ ను జోడించి తీసారు. ప్రస్తుతం ఇలాంటి జోనర్ లో వస్తున్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. ఖచ్చితంగా సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది" అని చెప్పారు.
రసమయి బాలకిషన్ మాట్లాడుతూ "అందరు కొత్తవాళ్ళతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. వీరు చేసిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
హీరో క్రిష్ మాట్లాడుతూ "సినిమాలో పాటలు బావున్నాయి. ప్రేమ అనే పాత్ర సినిమాలో చాలా ముఖ్యమైనది" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బేబీ ప్రేమ, శరత్ రావు, దిలీప్ రాథోడ్, సరిత తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రవీణ్ రెడ్డి, కెమెరా: ప్రవీణ్.కె, గోపి.కె, ఎడిటర్: రామ్ జెపి రావు, సౌండ్ ఎఫెక్ట్స్: రాజ్ కుమార్, కో-ప్రొడ్యూసర్: గండ్ల సరిత, నిర్మాత: సత్యరావు కడగాన, కథ-దర్శకత్వం: వి.ఎస్.ఫణీంద్ర.