తేజ చేతులమీదుగా తెరకు పరిచయమైంది నందిత. అచ్చమైన తెలుగమ్మాయైన నందిత ` ప్రేమ కథా చిత్రమ్`తో తొలి విజయాన్ని సొంతం చేసుకొంది. ఆ చిత్రం తర్వాత అందరి కళ్లూ నందితపైనే పడ్డాయి. మలయాళం సూపర్‌స్టార్ పృథ్వీ చిత్రంలోనూ ఆమె నటించింది. తెలుగులోనూ బోలెడన్ని సినిమాలు చేసింది. `లవర్స్`తోపాటు ఇటీవల వచ్చిన `కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ`లాంటి విజయాలు ఆమె ఖాతాలో పడ్డాయి. ఇన్ని విజయాలొచ్చాక ఇక తిరుగేముంటుంది? స్టార్ రైటర్ కోన వెంకట్ నుంచి పిలుపందుకొంది. ఆయన నిర్మాణంలో రూపొందుతున్న `శంకరాభరణం`లో నిఖిల్ సరసన నటిస్తోంది. దాంతోపాటు తాజాగా మరో ఆఫర్ కూడా ఆమె చేతికందినట్టు తెలుస్తోంది. నారా రోహిత్ కథానాయకుడిగా నటించనున్న `సావిత్రి`లో కథానాయికగా నందిత ఎంపికైనట్టు తెలిసింది. `ప్రేమ ఇష్క్ కాదల్` ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో `సావిత్రి` తెరకెక్కబోతోంది. సెప్టెంబరులో ఆ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం. తొలినాళ్లల్లో పోలిస్తే ఇటీవల నందిత అందం రెట్టింపైంది. కాస్త బొద్దుగా కూడా మారి కమర్షియల్ కథానాయిక కావల్సిన ఫీచర్స్ అన్నీ నాలో ఉన్నాయని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆ అందాలే ఆమెకి అవకాశాల్ని తెచ్చిపెడుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.