జి.వి.ప్రకాష్ కుమార్, ఆనందిని, మనీషా యాదవ్ ప్రధాన పాత్రల్లో రుషి మీడియా బ్యానర్ పై స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా సారధ్యంలో ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో కృష్ణ, రమేష్ నిర్మాతలుగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'త్రిష లేదా నయనతార'. ఈ చిత్రం ట్రైలర్, ఫస్ట్ లుక్, పోస్టర్ లాంచ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..
దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ మాట్లాడుతూ "ఓ అమాయకుడైన అబ్బాయి ఒకే సమయంలో ఇద్దరమ్మాయలను ప్రేమిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగిన చిత్రమిది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. సిమ్రాన్ ఈ చిత్రంలో ప్రాధాన్యత గల లీడ్ రోల్ లో నటిస్తుంది. హీరో ఆర్య, ప్రియానంద్ గెస్ట్ పాత్రలలో కనిపించనున్నారు. ఆగస్ట్ మొదటివారంలో ఆడియో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.
హీరో జి.వి.ప్రకాష్ మాట్లాడుతూ "మొదటగా నన్ను హీరోగా తమిళంలో 'డార్లింగ్' అనే సినిమాతో పరిచయం చేసిన అల్లు అరవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా విషయానికొస్తే ఇరవై ఏళ్ళ కుర్రాడు త్రిష, నయనతార లాంటి అమ్మాయల కోసం వెతుకుతూ ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత తన లైఫ్ ఎలా లీడ్ చేసాడనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో పాటలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. తమిళంలో ఆడియో పెద్ద హిట్ అయింది. తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాను. రామజోగయ్య శాస్త్రి, వెన్నెలకంటి, శ్రీమణి, రాఖీ మంచి సాహిత్యాన్ని అందిస్తున్నారు. దేవేశ్రీప్రసాద్ గారు ఓ పాట కూడా పాడుతున్నారు" అని చెప్పారు.
నిర్మాతలు కృష్ణ, రమేష్ మాట్లాడుతూ "ఇదొక మ్యాజికల్ థ్రిల్లర్ మూవీ. ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.
హీరోయిన్ ఆనందిని మాట్లాడుతూ "తమిళంలో ఈ సినిమా ట్రైలర్ కు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.తెలుగులో కూడా ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్, ఫోటోగ్రఫీ: రిచ్ద్ ఎమ్ నాదన్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఆదిక్ రవిచంద్రన్, నిర్మాతలు: కృష్ణ, రమేష్.