తెలంగాణలో మంత్రులకు పదవీ గండం పొంచి ఉంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇదివరకే కేసీఆర్ నుంచి సంకేతాలు వెళ్లినట్లు సమాచారం. అయితే ఎవరి పదవులు ఊడుతాయో.. ఎవరు కొత్తగా మంత్రివర్గంలోకి వస్తారోనన్న ఊహాగానాలు ఇప్పుడు గులాబిదళంలో జోరోగా సాగుతున్నాయి.
ప్రస్తుత మంత్రివర్గంలో ముగ్గురి పదవులు ఊడవచ్చని సమాచారం. మంత్రివర్యుల పనితీరు, వారి సామాజిక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ క్యాబినెట్ నుంచి తొలగించే మంత్రివర్యుల పేర్లు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్, నిజమాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన మంత్రుల పోస్టులు ఊడటం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ జిల్లాలకు చెందిన మంత్రులు ఇప్పుడు ఆందోళనలో పడ్డారు. వారంతా ఇప్పుడు కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో కొత్తగా మంత్రివర్గంలో ఎవరు చేరనున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. కొప్పుల ఈశ్వర్‌కు ఇప్పటికే రెండుసార్లు హ్యాండ్ ఇవ్వడంతో ఈసారి ఆయనకు మంత్రి పోస్టు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఇక టీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖకు కూడా మంత్రి పోస్టు ఖాయమైనట్లు సమాచారం. ఇప్పటికే తమకు టీఆర్‌ఎస్‌లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొండా ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తితో ఉంది. దీంతో ఆమెకు మంత్రి పోస్టు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పద్మాదేవేందర్‌రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కే చాన్స్ ఉంది. ఇప్పటివరకు కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో ఒకేసారి ఇద్దరు మహిళా మంత్రులను చేర్చుకొని విమర్శలకు తగిన రీతిలో సమాధానం చెప్పాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.