ప్రత్యేకంగా ఓ పాట తయారు చేయించి పవన్‌కళ్యాణ్‌కి బర్త్‌డే విషెస్ చెప్పింది శంకరాభరణం టీమ్. ఆ పాటకి మంచి అప్లాజ్ వచ్చింది. ముఖ్యంగా పవన్ అభిమానులకి పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఆ సినిమాకీ, పవన్‌కళ్యాణ్‌కీ మధ్య సంబంధమేమీ లేదు. కేవలం అభిమానంతోనే ఆ ప్రయత్నం చేశారు. శంకరాభరణం టీమ్ చేసిన ప్రయత్నానికి పవన్ ఆనందంతో పొంగిపోయాడో ఏంటో తెలియదు కానీ... ఆ సినిమా టీజర్‌ని విడుదల చేయడానికి తన అంగీకారం తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో పవన్‌కళ్యాణ్ చేతులమీదుగా శంకరాభరణం టీజర్ విడుదల కాబోతోందట. మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వేడుకలో టీజర్ రిలీజ్ చేస్తారా లేదంటే సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్లో విడుదల చేస్తాడా అన్నది తెలియాల్సి వుంది. నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శంకరాభరణం. నందిత హీరోయిన్‌గా నటిస్తోంది. ఉదయ్ నందనవనం దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్ సమర్పిస్తున్నాడు. పవన్‌తో కోన వెంకట్‌కి మంచి పరిచయం ఉంది. ఆయనే టీజర్ రిలీజ్‌ని విడుదల చేయాలని పవన్‌ని కోరాడట. వెంటనే ఓకే చెప్పారట. శంకరాభరణం టీమ్ ఇంతగా పవన్‌నామ జపం చేస్తోందంటే సినిమాలో ఏదో పవన్ ఉండే ఉంటుందని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. వరుసగా మూడు విజయాలు సొంతం చేసుకొన్న తర్వాత నిఖిల్ నటిస్తున్న చిత్రమిది. ఇందులో అమెరికాలో స్థిరపడ్డ ఓ ధనవంతుడి కొడుకుగా నిఖిల్ నటించాడు. ఇటీవలే చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. ఇక ప్రమోషన్‌పై దృష్టిపెట్టబోతున్నారు.