ఓంకార్ పేరు బుల్లితెరకు ఎంతలా సుపరిచయం అంటే ఏకంగా మనాడికి చిన్నితెర అన్నయ్య అన్న పేరుని కూడా పెట్టేసారు. సినిమా అనేది వ్యాపారంగా మారిపోయిన ఈ దశకంలో టీవీ మీద సంపాదించిన పేరు ప్రతిష్టలని, సొమ్ముని కూడా తాకట్టు పెట్టి ఓంకార్ దర్శకుడిగా, నిర్మాతగా నిలదొక్కుకోవాలని జీనియస్ అన్న చిత్రంతో ఇన్నింగ్స్ ప్రారంభించి డకౌట్ అయ్యాడు.
గడిచిన కొన్నేళ్లుగా జీనియస్ ఫలితాన్ని అయితే మరిచిపోయాడు గానీ తను దర్శకత్వం మీద పెంచుకున్న మక్కువను కాదు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా రాజు గారి గది అన్న ఓ హారర్ కామెడీని సిద్ధం చేసి దసరాకు వదలబోతున్నాడు. సినిమాను చూసిన వారాహి సంస్థ అధినేత సాయి కొర్రపాటి, ఏకె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఓంకార్ సంయుక్త నిర్మాణ భాగస్వాములుగా చేరిపోయారంటే రాజు గారి గదిలో ఏదో విషయాన్ని గట్టిగా దాచినట్టే. హారర్ కామెడీలు పుంఖాను పుంఖాలుగా తెలుగు తెర మీదకు కొట్టుకు వస్తున్నా ఓంకార్ ప్రయత్నం సఫలం కావాలని, ఈ మూవీతో అయినా జనాలు అన్నయ్యని దర్శకుడిగా గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.