గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ సినిమా.. సౌఖ్యం
ఇద్దరు మనుషులు ఎదురైనప్పుడు పెదాల మీద చిరునవ్వుతో పాటు మనసులోనుంచి వచ్చే మాటే సౌఖ్యంగా ఉన్నారా అని. ఎదుటివారి సౌఖ్యాన్ని గురించి ఆలోచించేది ఆత్మీయులే. అలాంటి ఆత్మీయులందరూ సౌఖ్యంగా ఉండాలనుకునే వ్యక్తి కథతో తెరకెక్కుతున్న సినిమా సౌఖ్యం. గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు సౌఖ్యం అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెజీనా కథానాయిక.
ఈ సినిమా గురించి నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ..తన ఇంట్లో ఉండే వారు మాత్రమే కాదు, తన చుట్టుపక్కలవాళ్ళు కూడా సౌఖ్యంగా ఉండాలనుకునే తత్వం మా హీరోది. అందుకోసం యాక్షన్ బరిలోకి దూకడానికైనా సిద్ధమే. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికైనా సిద్ధమే. నలుగురి సౌఖ్యం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే హీరో కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. దశాబ్దం క్రితం ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన యజ్ఞం ఆబాలగోపాలాన్ని ఎంతగా అలరించిందో తెలిసిందే. ఇప్పుడు అందుకు ఏమాత్రం తగ్గకుండా సౌఖ్యం చిత్రాన్ని రూపొందిస్తున్నాం. వారిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకులు ఎదురుచూసే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. మనుషుల మధ్య ఉంటే అనుబంధాలు, ఆప్యాయతలకు పెద్ద పీట వేసిన సినిమా ఇది. టాకీ పూర్తయింది. పాటలు మిగిలున్నాయి. ఈ నెల 26 నుంచి నవంబర్ 7 వరకు విదేశాల్లో మూడు పాటలను చిత్రీకరిస్తాం. అనూప్ రూబెన్స్ సంగీతంలో పాటలు చాలా హుషారుగా సాగుతాయి. విన్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్సాహం పొంగుతుంది. యూత్ తప్పకుండా ఫుట్ ట్యాపింగ్ మ్యూజిక్ అని కితాబిస్తారు. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో రఘు మాస్టర్ నేతృత్వంలో హీరో, హీరోయిన్లపై మూడు పాటలను చిత్రీకరిస్తాం. మిగిలిన రెండు పాటలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తాం. అందులో ఒకటి ఐటమ్ సాంగ్, మరొకటి హీరో ఇంట్రడక్షన్ సాంగ్. దాంతో మొత్తం సినిమా పూర్తవుతుంది. మరో వైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే డబ్బింగ్ పనులను పూర్తి చేశాం. క్రిస్‌మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తాం.. అని అన్నారు.
దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ...సౌఖ్యంగా ఉన్నారా? అని ఎదుటివారు అడిగినప్పుడు మనసు తెలియకుండా ఒకరకమైన ఆనందానికి లోనవుతుంది. ఎదుటివారి క్షేమసమాచారాలను కనుక్కోవడం మనకున్న సంస్కారం. అలాంటి సంస్కారం తెలిసిన యువకుడు తన వారి సౌఖ్యం కోసం, తన చుట్టూ ఉన్న వారి సౌఖ్యం కోసం యాక్షనే చేశాడా? ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే కొనసాగాడా? అనేది ఈ సినిమాలో ప్రధానాంశం. గోపీచంద్, రెజీనా జంట చూడ్డానికి చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. అనూప్ మంచి సంగీతాన్నిచ్చారు. సినిమా చాలా బాగా వస్తోంది. పదేళ్ళ తర్వాత గోపీచంద్‌తో మరలా పనిచేస్తుంటే ఒకరకమైన ఉత్సాహంగా ఉంది.. అని చెప్పారు.
గోపీచంద్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణభగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృథ్వి, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కథ, మాటలు; శ‌్రీధర్ సీపాన, సంగీతం: అనూప్ రూబెన్స్, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, కెమెరా: ప‌్రసాద్ మూరెళ్ళ, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ : వివేక్, నిర్మాత: వి.ఆనంద్‌ప్రసాద్.