ప్రముఖ విద్యావేత్త భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న మెసేజ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఆదిత్య'(క్రియేటివ్ జీనియస్). ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని నవంబర్ 6న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో..
భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ ''మంచి సందేశంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా మిక్స్ చేసిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. అదే సమయంలో అందర్నీ ఆలోచింపజేస్తుంది. రెండు రాష్ట్రాల వినోదపు పన్ను మినహాయింపు కొరకు ప్రయత్నించడం వలన సినిమాను విడుదల చేయడం లేట్ అయింది. ఆశించిన విధంగానే రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం వినోదపు పన్నును మినహాయించింది. విద్యార్థులకు స్ఫూర్తినందించే చిత్రమిది. వ్యాపారం కోసం ఈ చిత్రాన్ని రూపొందించలేదు. మాటల్లో చెప్పేదానికంటే తెరపై చూపించగలిగితే అందరికి కనెక్ట్ అవుతుందనే ఆలోచనతో సినిమా చేసాం. నవంబర్ 6న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ''అనాధ బాలుడు సైంటిస్ట్ అవ్వడమనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనాధ బాలబాలికలు ఉండకూడదనే ఆలోచనతో నేను నా స్నేహితులతో కలిసి ఓ ప్రాజెక్ట్ మొదలు పెట్టాను. ఈ విషయమై త్వరలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నాం. ఇలా అన్ని ప్రాంతాలలోను చేయగలిగితే అనాధ అనేవారు ఉండరు. ఇలాంటి చిత్రాలు ప్రేక్షకులకు చేరువవ్వాలంటే థియేటర్స్ కావాలి. ఇప్పటికే విజయవాడలో చిన్న చిత్రాల కోసం మోడల్ థియేటర్స్ ను ప్రారంభించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. అని చెప్పారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ''తెలుగు ఇండస్ట్రీలో బాలల చిత్రాలు ఎన్నో వచ్చాయి. ఎం.ఎస్.రెడ్డి గారు నిర్మించిన బాలరామాయణం చిత్రానికి ఇరవై లక్షలు సబ్సీడీ లభించింది. అదే విధంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదిత్య చిత్రానికి వినోదపు పన్ను మినహాయించడం ఆనందంగా ఉంది. ఇలాంటి చిత్రాలను ప్రోత్సహిస్తేనే మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి'' అని చెప్పారు.
ప్రేమ్ బాబు మాట్లాడుతూ ''ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాను. మంచి సందేశాత్మక చిత్రం. ఈ సంవత్సరం చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: శంకర్ కంతేటి, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం, సాహిత్యం: బండారు దానయ్య కవి, రీరికార్డింగ్: వందేమాతరం శ్రీనివాస్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే -నిర్మాత, దర్శకత్వం: భీమగాని సుధాకర్ గౌడ్.