ప్రేమమ్ రీమేక్ ఇక సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. మొన్నటిదాకా మూడో హీరోయిన్ గురించి కసరత్తులు చేశారు. ఆ విషయంలో కూడా చిత్రబృందం ఓ నిర్ణయానికొచ్చేసినట్టు తెలిసింది. ఆయేషా శర్మని మూడో హీరోయిన్‌గా ఎంచుకొన్నారట. చిరుతలో నటించిన నేహాశర్మ చెల్లెలే ఆయేషా శర్మ. త్వరలో పూరి తెరకెక్కించనున్న కొత్త సినిమా రోగ్‌లో ఆయేషా ఆఫర్ కొట్టింది. ఆ అమ్మాయిని చూసి ప్రేమమ్ టీమ్ కూడా ప్రేమలో పడిందట. దీంతో వెంటనే ఓకే చేసేశారు. నాగచైతన్య ప్రేమమ్‌పై చాలా ఆసక్తిగా ఉన్నాడు. తన కోసం చందు మొండేటి ఓ కొత్త కథ తయారు చేసినా... దాన్ని పక్కనపెట్టి మరీ ప్రేమమ్‌ని రీమేక్ చేయిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలుంటారు. ఇప్పటికే శ్రుతిహాసన్, అనుపమలని ఎంపిక చేసుకొన్నారు. తాజాగా మూడో హీరోయిన్ కూడా ఓకే అయ్యింది. ఇక చిత్రీకరణ షురూ చేయబోతున్నారు. మలయాళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ స్టోరీ తెలుగులోనూ అదే మేజిక్‌ని రిపీట్ చేస్తుందేమో చూడాలి. నాగచైతన్య ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో సినిమా హడావుడిలో వున్నాడు. ఆ పనులు పూర్తి అవ్వగానే ప్రేమమ్ రీమేక్ కోసం రంగంలోకి దిగబోతున్నాడు.