స్నేహా చిత్ర పిక్చర్స్ బ్యానర్ పై ఆర్.నారాయణమూర్తి, విక్రమ్, ప్రసాద్ రెడ్డి, త్రినాద్ ప్రధాన పాత్రల్లో నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'దండకారణ్యం'. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సందర్భంగా..
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. ''నా బ్యానర్ లో వస్తున్న 28వ చిత్రమిది. త్రేతాయుగంలో సీతారాములను, ద్వాపరయుగంలో పాండవులకు ఆశ్రయం కల్పించిన ఈ దండకారణ్యం కలియుగంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ప్రభుత్వం చేపట్టే గనులు, బాక్సైట్ తవ్వకాల వలన ఆదీవాసీయుల మనుగడ లేకుండా పోతుంది. పర్యావరణమంతా.. సర్వనాశనం అయిపోతుంది. రాజ్యాంగంలో ఆదీవాసీయుల హక్కులను ఉల్లంగించి ప్రభుత్వం ఈ పనులను చేపడుతుంది. వారి హక్కుల కోసం చర్చించే చిత్రమే ఈ దండకారణ్యం. మూల వనరులు మూలవాసీయులకే చెందాలి. విదేశీపాలు కాకూడదు. ఇందులో మొత్తం ఏడు పాటలున్నాయి. గద్దర్ మూడు పాటలను పాడారు. వందేమాతరం శ్రీనివాస్ నాలుగు పాటలను రాశారు. గోరటి వెంకన్న, కాశిపతి, ములుగు తిరుపతి వంటి ప్రజాకవులు ఈ సినిమాకు సాహిత్యం అందించారు. విజయనగరం, బొబ్బిలి, అరకు లోయ, పాల్వంచ, రంపచోడవరం, పాపికొండలు, చత్తీస్ ఘడ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాం. అక్కడున్న స్థానికులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్, డబ్బింగ్ పూర్తయింది. ప్రస్తుతం రీరికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ జరుగుతుంది. జనవరి నెలలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాను'' అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: శివకుమార్, ఆపరేటివ్ కెమెరామెన్: నాగేష్ బాబు, కథ,చిత్రానువాదం, మాటలు, ఎడిటింగ్, కోరియోగ్రఫీ, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్.నారాయణమూర్తి.