విక్రమార్కుడు, గబ్బర్ సింగ్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన కమెడియన్ ప్రభాస్ శ్రీను. ప్రస్తుతం ఆయన నటించిన 'ఎక్స్ ప్రెస్ రాజా' జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ప్రభాస్ శ్రీను సినిమా గురించి విలేకర్లతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో శర్వానంద్ కు మేనమామ పాత్రలో నటించాను. హీరోతో ట్రావెల్ అవుతూ ఉండే ఫుల్ లెంగ్థ్ క్యారెక్టర్ నాది. ఇప్పటివరకు నేను ఇలాంటి పాత్రలో నటించలేదు.10 నుండి 15 నిమిషాలు మాత్రమే స్క్రీన్ పై కనిపించేవాడిని. మొదటిసారిగా ఫుల్ లెంగ్థ్ రోల్ చేస్తున్నాను. ఈ సినిమా తరువాత నాకు ఇలాంటి పాత్రలే వస్తాయని ఆశిస్తున్నాను. శర్వానంద్ మంచి నటుడు. సెట్స్ లో అందరితో ఒకే విధంగా ఉంటాడు. ఈ సినిమాలో ఎక్కువ మాస్ ఎలిమెంట్స్, ఫన్ ఉన్న పాత్రలో నటించాడు. ఒక ఇష్ష్యూ వలన సినిమా అంతా హీరో పరిగెడుతూనే ఉంటాడు. అందుకే 'ఎక్స్ ప్రెస్ రాజా' అనే టైటిల్ పెట్టారు. విక్రమార్కుడు, గబ్బర్ సింగ్ చిత్రాలతో నా కెరీర్ కు మంచి బ్రేక్ వచ్చింది. ఆ చిత్రాల తరువాత అంతటి పేరు తెచ్చిపెట్టే సినిమా ఇది. నాకు ఎంటర్టైన్మెంట్ ఉండే పాత్రల్లోనే నటించాలనిపిస్తుంది. విలన్ గా నటించిన అందులో ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ప్రస్తుతానికి అలాంటి పాత్రల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. కమెడియన్ గా, ఫన్నీ గా ఉండే విలన్ పాత్రల్లో నటిస్తూ.. కెరీర్ సాగించాలనుకుంటున్నాను'' అని చెప్పారు.