'చంటిగాడు' , 'ప్రేమికులు' , 'లవ్లీ' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు బి.జయ 'వైశాఖం' అనే మరో రొమాంటిక్ కామెడీ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేసేందుకు బుధవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..
నిర్మాత బి.ఏ.రాజు మాట్లాడుతూ.. '' 'ప్రేమలో పావని కళ్యాన్','చంటిగాడు', 'ప్రేమికులు' , 'లవ్లీ' వంటి చిత్రాల తరువాత మా సంస్థలో రాబోతోన్న మరో చిత్రం 'వైశాఖం'. లవ్లీ సినిమా తరువాత మంచి సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశ్యంతో కాస్త గ్యాప్ తీసుకున్నాం. ఇక నుండి రెగ్యులర్ గా మా బ్యానర్ లో సినిమాలు చేయాలనుకుంటున్నాం. ఆర్.జె.సినిమాస్ బ్యానర్ లో మొదలుపెట్టిన ప్రతి సినిమా మేము అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తి చేస్తాం. పక్కా ప్లానింగ్ తో సినిమాను మొదలుపెడతాం. ఈ చిత్రంలో కొత్త హీరోలతో సీనియర్ ఆర్టిస్టులు నటించే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో మా బ్యానర్ ను వేరే బ్యానర్లతో టైఅప్ చేసి సినిమాలను నిర్మించాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
బి.జయ మాట్లాడుతూ.. ''జర్నలిస్ట్ గా ఉంటూ.. సినిమాల గురించి తెలుసుకునేదాన్ని. ఆ సమయంలోనే సినిమా చేయాలనుకున్నాను. 'లవ్లీ' సినిమా తరువాత ఏదొక సినిమా చేసి ఓకే అనిపించుకోవడం కాకుండా నేను చేసే సినిమా రిఫరెన్స్ గా ఉండాలని గ్యాప్ తీసుకొని మంచి సబ్జెక్టు రెడీ చేసుకున్నాను. 'వైశాఖం' ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ ఫిలిం. ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి అనుభూతిని కలిగించే చిత్రం. ఈ సినిమాలో ఎలాంటి స్పూఫ్ లు ఉండవు. సినిమా చాలా బావుందని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా సినిమా ఉంటుంది'' అని చెప్పారు.