హాస్యనటుడు అల్లురామలింగయ్య జాతీయ అవార్డు2015ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు అందజేశారు. స్వర్ణకంకణం, స్వర్ణకిరీటం, పురస్కారంతో పాటు వీణను అందజేశారు. ఈ సందర్భంగా..
చిరంజీవి మాట్లాడుతూ.. ''అల్లు రామలింగయ్యగారికి ఆప్తుడు, మనసుకు దగ్గరైన వ్యక్తి, శ్రేయోభిలాషి రాఘవేంద్రరావుగారికి ఈ అవార్డుని ఇవ్వడం సంతోషంగా ఉంది. అల్లు రామలింగయ్యగారికి, రాఘవేంద్రరావుగారి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ అవార్డును రాఘవేంద్రరావుగారికి ఈ ఏడాది ఇవ్వడం సముచితం. ఈ యేడాది ఈ అవార్డును రాఘవేంద్రరావుగారు అందుకోవడం ఆయనకు గౌరవమైతే, ఆ ఆవార్డును అందుకోవడం అవార్డుకే గౌరవాన్ని తెచ్చింది. రాఘవేంద్రరావుగారి సినిమాలన్నింటిలో అల్లురామలింగయ్యగారు నటించారు. వీరి మధ్య అనుబంధం దశాబ్దాలు కొనసాగింది. అందరికీ తెలిసి అల్లు రామలింగయ్యగారు గొప్ప హాస్యనటుడు అయినా ఆయన గొప్ప వ్యక్తిత్వమున్న వ్యక్తి. సినిమాల్లో నేను ఆయనకు అభిమాని అయితే వ్యక్తిగతంగా ఆయనెంటో తెలిశాక వీరాభిమానిగా మారాను. తెలుగు భాష మీద మక్కువ ఉండే వ్యక్తి. ఆయనతో కూర్చోవడమే ఎడ్యుకేషన్. నాకు, రాఘవేంద్రరావు మధ్య మూడున్నర దశాబ్దాల అనుబంధం కొనసాగింది. ఎందరితో పని చేసిన రాఘవేంద్రరావుగారితో పనిచేయాలని ఉండేది. అప్పుడే ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఏర్పడుతుందని అనుకునేవాడిని. ఆయన దర్శకత్వంలో అడవిరాముడు చిత్రాన్ని రామారావుగారు చేస్తే, నేను అడవిదొంగ సినిమాలో నటించారు. నన్ను మాస్ హీరోగా మరింత దగ్గర చేసే నా స్టామినాను పెంచారు. ఆయన సినిమాలో చేయడం గొప్పగా ఫీలయ్యాను'' అని అన్నారు.
గంటాశ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''అల్లురామలింగయ్యగారు గురించి నాకు చాలా మంది చాలా విషయాలు చెప్పేవారు. ముఖ్యంగా చిరంజీవిగారు అల్లురామలింగయ్యగారి ఆయన చేసిన పనులు గురించి చెబుతుండేవారు. అటువంటి గొప్ప వ్యక్తి పేరున అవార్డును స్థాపించి దాన్ని సినీ రంగంలోని ప్రముఖులకు అందజేస్తున్నారు. ఇప్పుడు రాఘవేంద్రరావుకు అందజేస్తున్నందకు ఆనందంగా ఉంది'' అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో తలసాని శ్రీనివాసయాదవ్, సారిపల్లి కొండలరావు, అల్లు అర్జున్, నిర్మాత అశ్వనీదత్, అల్లుఅరవింద్, అల్లుశిరీష్, పరుచూరి వెంకటేశ్వరరావు, డా||గోపీచంద్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.