టాలీవుడ్‌లో హీరోయిన్లయినా, బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన హీరోయిన్లు అయినా తమ కెరీర్ బాగుందీ అంటే వాళ్ళ చెల్లెళ్ళను కూడా రంగంలోకి దింపడం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడు మరో హీరోయిన్ అలా తన చెల్లెల్ని హీరోయిన్ చెయ్యడానికి కృషి చేస్తోంది. మహేష్‌తో 1 నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనన్ తన చెల్లెలు నుపూర్ సనన్‌కి ఈ విషయంలో ఫుల్ సపోర్ట్ ఇస్తోంది.
రోహిత్‌శెట్టి దర్శకత్వంలో షారూఖ్‌ఖాన్, కాజోల్ నటించిన దిల్‌వాలే చిత్రంలో కృతి సనన్ కూడా ఓ హీరోయిన్‌గా నటించింది. ఎంతో పాపులర్ అయిన ఈ చిత్రంలోని జనమ్ జనమ్ అనే పాటను ఒరిజినల్‌గా అజిత్ సింగ్ పాడాడు. అదే పాటను కృతి చెల్లెలు నుపూర్ పాడి, ఆ పాట మేకింగ్ వీడియోను యూ ట్యూబ్‌లో పెట్టింది. దీంతో ఆ పాటకు విపరీతమైన వ్యూస్ వచ్చాయి. పాట బాగా పాడింది, అమ్మాయి కూడా బాగుంది అనుకున్న దర్శకనిర్మాతలు నుపూర్‌తో సినిమాలు చెయ్యడానికి ముందుకొస్తున్నారు. అక్క కృతి ఎంకరేజ్‌మెంట్ కూడా వుండడంతో నుపూర్ హీరోయిన్‌గా నటించడానికి ఓకే చెప్పింది. ప్రస్తుతం నుపూర్‌కి చాలా ఆఫర్స్ వున్నాయి. మరి ఏ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందో చూడాలి.