మహేష్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందిన శ్రీమంతుడు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమ బేనర్‌లో నిర్మించిన మొదటి సినిమానే సూపర్‌హిట్ చేసిన కొరటాల శివతోనే మరో సినిమా చెయ్యాలని డిసైడ్ అయిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ పేరుతో ఓ సినిమాకి ముహూర్తం చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గత కొన్నిరోజులుగా పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్‌గా ఫిబ్రవరి 22న స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు.
మరోపక్క తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ రీమేక్ చెయ్యడానికి రెడీ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ని ఫిబ్రవరి 22న స్టార్ట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇంతవరకు బాగానే వుంది. ఇద్దరు టాప్ హీరోలు చేస్తున్న సినిమాల షూటింగ్స్ ఒకేరోజు స్టార్ట్ అవ్వడమనేది విశేషం కాదు. ఈ రెండు సినిమాల్ని ఒకేరోజు రిలీజ్ చెయ్యాలనుకోవడం మాత్రం గొప్ప విశేషమనే చెప్పాలి. ఇది నిజమే. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, రామ్‌చరణ్ కొత్త సినిమాని ఒకేరోజు షూటింగ్స్ స్టార్ట్ చెయ్యడమే కాదు ఒకేరోజు అంటే ఆగస్ట్ 12న రిలీజ్ చెయ్యాలని రెండు చిత్రాల నిర్మాతలు విడి విడిగా డిసైడ్ అయ్యారు. షూటింగ్స్ కూడా స్టార్ట్ అవ్వని రెండు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో పోటీ పడుతున్నాయని తెలియడంతో సినీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ప్రస్తుతం దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారట.