కింగ్ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ నిర్మల కాన్వెంట్. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం ద్వారా అస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ నేపథ్య గాయకుడుగా పరిచయమవుతున్నారు. కడపలోని అమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తి శ్రద్ధలతో తరచూ దర్శించుకొనే రెహమాన్ తన కుమారుడికి అమీన్ అనే పేరుని పెట్టుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో సంగీత కళాకారుడుగా ఎదుగుతున్న ఎ.ఆర్.అమీన్‌ను నిర్మల కాన్వెంట్ చిత్రంలో ఓ పాట పాడించి సింగర్‌గా సగర్వంగా పరిచయం చేస్తున్నారు కింగ్ నాగార్జున. ఈ పాటను ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్న కింగ్ నాగార్జున.. ఎ.ఆర్.అమీన్‌ను ఈ చిత్రం ద్వారానే సింగర్‌గా ఇంట్రడ్యూస్ చెయ్యడం విశేషం.
కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్, తాగుబోతు రమేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, నిర్మాతలు: అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.