అడవి శేష్, ఆదా శర్మ, అనసూయ భరద్వాజ ప్రధాన పాత్రల్లో రవికాంత్ పేరెపు దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'క్షణం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు రవికాంత్ పేరెపు మాట్లాడుతూ.. ''రేపే సినిమా రిలీజ్ అవుతోంది. చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాం. ఒక దర్శకునిగా ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాను. పివిపి గారు ఈ సినిమాను కోటి రూపాయల బడ్జెట్ లో తీయాలని చెప్పారు. సినిమా తీయడానికి ఎంత ఖర్చుపెట్టామో.. ప్రమోషన్స్ కు కూడా అంతే ఖర్చుపెట్టాం. శ్రీ చరణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. ఆర్టిస్ట్స్ అందరు నేను అనుకున్న దానికంటే ఎక్కువ పెర్ఫార్మ్ చేశారు. ఓ మంచి సినిమా చూసామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది'' అని చెప్పారు.
నిర్మాత పివిపి మాట్లాడుతూ.. ''నేను మాటలు చెప్పే రకం కాదు. చేతల్లో చూపించాలనుకునే వాడ్ని. ఒక కోటి రూపాయల ఖర్చుతో ఈ సినిమా చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇలాంటి జోనర్ సినిమాలు ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతాయో చెప్పలేం. సినిమా బడ్జెట్ ఎంత అవుతుందో.. అంతే ప్రమోషన్స్ కు పెట్టాలనుకున్నాం. ఈ సినిమా హిట్ అయితే బావుంటుంది. లేదంటే మరొక సినిమా చేస్తా'' అని చెప్పారు.
అడవి శేష్ మాట్లాడుతూ.. ''క్షణం అనేది నా పెర్సనల్ డ్రీం. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఏడు సినిమాల్లో నటించాను. కాని ఈ సినిమాకు కష్టపడినట్లు ఏ సినిమాకు కష్టపడలేదు. ప్రతి విషయంలో పెర్సనల్ కేర్ తీసుకొని చేశాం. సినిమా లోగో లోనే మా హార్ట్ చూపించాలనుకున్నాం. నా సొంత సినిమా 'కర్మ'ను మూడు కోట్ల బడ్జెట్ లో తీశాం. అలాంటిది ఈ సినిమాను కోటి రూపాయల బడ్జెట్ తీయడమంటే కష్టమనిపించింది. ఫిబ్రవరి 26న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో ఇంత హానెస్ట్ ఫిలిం మాత్రం రాలేదు'' అని చెప్పారు.
అనసూయ మాట్లాడుతూ.. ''క్షణం ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత సినిమాపై అందరి అంచనాలు పెరిగాయి. ఒక విధంగా సంతోషంగా ఉన్నా.. టెన్షన్ గా కూడా ఉంది. మా కథే మా బలం. సినిమా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
శ్రీ చరణ్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా క్రెడిట్ మొత్తం రవికాంత్ కే చెందుతుంది. సినిమా మ్యూజిక్ చేయడం సంతోషంగా ఉంది. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. 'చెలియా' అనే పాట రేడియోలలో వినిపించే మొదటి 5 పాటల్లో ఉంది'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఆదా శర్మ, రవివర్మ, సత్యదేవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కథ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సినిమాటోగ్రఫీ: షనిల్ డియో, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్స్ గైడన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.