పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై శరత్ మరార్, పవన్ కళ్యాణ్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని నొవెటల్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి బిగ్ సీడీను, ఆడియో సీడీలను, థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ''హీరో అంటే నాకు అన్నయ్య చిరంజీవి గారే. నాకు చిన్నప్పుడు అమితాబ్ అంటే పిచ్చి ఉండేది. కాని అన్నయ్య హీరో అయిన తరువాత ఇంకెవరు హీరోగా కనిపించేవారు కాదు. నన్ను నేను యాక్టర్ గా ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు నేను నటుడిగా ఉన్నానంటే దానికి మూల కారణం మా అన్నా వదినలే.. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే రూంలోకి వెళ్లిపోయేవాడ్ని. నా నైజామ్ అలాంటిది. అలాంటి నన్ను ఇంతమంది ముందుకు వచ్చేలా చేశారు. నాకు అన్నయ్య మీద ఉన్న ఇష్టాన్ని బహిరంగంగా.. చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏం చదువుకోవాలి..? భవిష్యత్తులో ఏం చేయాలని ఖాళీగా కూర్చొని తినే రోజుల్లో అన్నయ్య షూటింగ్ వెళ్లి రాత్రి 12 గంటలకు కష్టపడి ఇంటికి వచ్చేవాడు. కాళ్ళు నొప్పులతో షూ కూడా తీయకుండా.. పడుకుంటే చెమట పట్టిన తన కాళ్ళ బూట్లలో నాకు సువాసన అనిపించేది. చెమట, కష్టం విలువ అప్పుడు తెలిసింది. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఎవరి అండదండలు లేకుండా హీరోగా ఈ స్థాయికి వచ్చాడు. తనకంటూ..ప్లాట్ ఫాం క్రియేట్ చేసుకున్నాడు. ఒక గోల్ అనుకుంటే సాధించగలమని అన్నయ్య చెప్పాడు. చాలా మందికి స్పూర్తినిచ్చిన మహా వ్యక్తి. ఆయనకు చెడ్డపేరు తీసుకురాకూడదని ఎక్కువ కష్టపడేవాడ్ని. రాజకీయపరంగా ఆయనకు నచ్చనిది చేశాను. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ఆయనకు వివరించాను. నన్ను అర్ధం చేసుకున్నారు. మా బంధం వేరు, రాజకీయాలు వేరు. అన్నయ్య మీద ప్రేమ నా గుండెల్లో ఉంటుంది. మా తల్లిదండ్రుల తరువాత అంతటి వారు నాకు అన్నా వదినలే. నేను చేసిన 'జానీ' సినిమా ఫ్లాప్ అయింది. క్రియేటివ్ ప్రాసెస్ లో ఫెయిల్యూర్ సహజం. దానికి భయపడి పారిపోకూడదు. అవికేకంతో ఆ సినిమా చేయలేదు. నాకున్న పరిధిలో చేశాను. కాని ఈ సినిమా జానీ లాగా డిసప్పాయింట్ చేయననే నమ్మకం నాకుంది. ఇండియన్ వెస్ట్రన్ సినిమా చేయాలనేది నా కోరిక. ఈ సినిమా స్క్రిప్ట్ రెండున్నర సంవత్సరాలు రాసుకున్నాను. ఈ ప్రాసెస్ లో నన్ను భరించి నా స్నేహితుడు శరత్ మరార్ నాతోనే ఉన్నాడు. అనుకున్న సమయంలో సినిమాను రిలీజ్ చేయాలని అందరిని హింసించాను. నిజానికి ఈ సినిమా చివరి సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ కావాల్సింది. నేను లేట్ చేస్తూ వచ్చాను. అయినా మాకు సహకరించిన ఈరోస్ సంస్థకు నా అభినందనలు'' అని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ''చాలా కాలం తరువాత తమ్ముడు కళ్యాణ్ బాబు సినిమా ఫంక్షన్ లో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ మధ్యకాలంలో రిపీటెడ్ గా చూసిన సినిమా ఏదైనా ఉంటే అది 'గబ్బర్ సింగ్' సినిమా. సినిమాలో సాంగ్స్ గానీ, సీన్స్ గానీ టీవీలో వస్తుంటే చాలా ఇంటరెస్టింగ్ గా చూస్తూ.. ఉండిపోయేవాడ్ని. కళ్యాణ్ బాబు నటించిన అన్ని సినిమాల్లో గబ్బర్ సింగ్ ను మాత్రం చాలా ఆసక్తిగా చూసేవాడిని. పవన్ కళ్యాణ్ విశ్వరూపం ఆ సినిమాలో చూశాం. ఈ రకంగా పవన్ తన అభిమానులను అలరించాలని కోరుకునేవాడ్ని. 'దబాంగ్' సినిమాకు గబ్బర్ సింగ్ కు అసలు సంబంధం ఉండదు. ఒరిజినల్ స్క్రిత్ప్ ను తీసుకొని పవన్ స్టైల్ లో మార్చి తీశాడు. ట్రెండ్ ను పవన్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు. గబ్బర్ సింగ్ తో ఆ విషయం ప్రూవ్ అయింది. అత్తారింటికి దారేది సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రలో నటించి సెపరేట్ ట్రెండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా పవన్ మనసు పెట్టి చేసిన సినిమా. పవన్ అందించిన కథ, కథనాన్ని బాబీ చక్కగా తెరకెక్కించాడు. వీరిద్దరి కాంబినేషన్ అత్యద్బుతం. బాబీ డైరెక్ట్ చేసిన 'పవర్' సినిమా చూశాను. టాలెంట్ ఉన్న డైరెక్టర్. అలాంటి టాలెంట్ ను గుర్తించి పవన్ తనకు అవకాశం ఇచ్చాడు. రామ్ పూర్ అనే సెట్ వేసి 'షోలే' సినిమా చేశారు. ఈ సినిమా కోసం రతన్ పూర్ అనే సెట్ వేశారు. నేను సెట్స్ కి వెళ్లి చూసినప్పుడు షోలే సినిమా ఫీలింగ్ కలిగింది. ఈ సినిమా కూడా మరో 'షోలే' అవుతుందనడంలో సందేహం లేదు. పవన్ లో హ్యూమనిజం, హ్యూమర్ యాంగల్ ఉంది. హీరోయిజానికి హ్యూమర్, మాస్ తోడయ్యి.. ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగితే ఆ సినిమా ఎలాంటి హైట్స్ కు రీచ్ అవుతుందో ఊహించలేం. ఎంటర్టైన్మెంట్, డ్రామా, హ్యూమర్ టచ్ తో ఈ సినిమా ఉంది. అందరిలానే నేను కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ ఈ సినిమాలో ఉందని తెలిసి సినిమా చూడాలనే ఆసక్తి మరింతగా పెరిగింది. పవన్ సినిమాల్లోకి రాక ముందు తను భవిష్యత్తులో ఏం చేయాలో డైరెక్షన్ ఇవ్వమని నన్ను, తన వదినను కలిసి మాట్లాడాడు. నువ్వు హీరో అవ్వాలన్నది మా కోరిక అని చెప్పాం. దానికి తగినట్లుగా తను ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు పవన్ ఈ స్థాయిలో ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంది. తన ఎదుగుదలను చూసి మొదట సంతోషించేది నేను, మా తల్లితండ్రులు. అలాంటిది పవన్ రెండు మూడు సినిమాల తరువాత ఏం చేస్తానో చెప్పలేకపోతున్నానని చెప్పాడు. తను ఏ రంగంలో ఉన్నా.. రాణించగలడు. అంత మాత్రం చేత ఈ రంగాన్ని దూరంగా పెట్టాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పాను. జోడు గుర్రాల స్వారీ చేయగలిగే కెపాసిటీ పవన్ లో ఉంది. నా మాట కాదనడనే అనుకుంటున్నాను(నవ్వుతు..). ఈ సినిమాతో రికార్డ్స్ బ్రేక్ చేయాలని ఇండస్ట్రీలో ఆరోగ్యవంతమైన పోటీ ఉండాలని కోరుకుంటున్నాను. రికార్డ్స్ అనేవి అందరి సొంతం కావాలి. శరత్ మరార్ మాకు అత్యంత ఆప్తుడు. ఈ సినిమాతో తను పెద్ద ప్రొడ్యూసర్ కావాలి. అలానే కాజల్ చాలా చక్కటి అభినయాన్ని కనబరుస్తుంది. దేవిశ్రీప్రసాద్ నా స్నేహితుడు సత్యమూర్తి కొడుకు. చిన్నప్పుడు తన ప్రతిభ చూసి చేతి గడియారం గిఫ్ట్ ఇచ్చాను. ఈరోజు నా నెక్స్ట్ మూవీ కు తన మ్యూజిక్ ఇస్తాడేమో అని అడిగే సమయాన్ని నాకివ్వడం లేదు దేవీ. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీను ఏలుతున్నాడు. ఈ సినిమా 100 కోట్ల బిజినెస్ చేస్తోందని తెలిసి చాలా ఆనందంగా అనిపించింది. బాలీవుడ్ లో ఏకంగా 800 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా 100 రోజులు ఫంక్షన్ జరుపుకోవాలి'' అని చెప్పారు.
దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ''చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగాను. కాలేజీకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి పండగ వచ్చింది. ఇండస్ట్రీకు వచ్చి 14 సంవత్సరాలవుతుంది. ఆయనతో ఒక ఫోటో దిగాలని ఆశపడేవాడ్ని. కాని ఈరోజు పవన్ గారిని డైరెక్ట్ చేసే అవకాశం రావడం నా అద్రుష్టంగా భావిస్తున్నాను. ఆయన నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అన్ని సంవత్సరాలు ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ను నా చేతిల్లో పెట్టారు. నాకు ఎంతో ఫ్రీడం ఇచ్చారు. యుద్ధం ఎలా చేయాలి..? మొండితనం, ఓపిక ఇలా ఆయన దగ్గర అన్నీ నేర్చుకున్నాను. జ్వరం వచ్చినా.. షూటింగ్ మాత్రం ఆపకుండా నటించారాయన. యుద్ధంలో ఆయన రాజైతే.. మేము సైనికులం. శరత్ మరార్ గారు వెనుకే ఉండి సినిమాను నడిపించారు. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అంటే నాకు పిచ్చి. ఈ సినిమాను మంచి మ్యూజిక్ ఇచ్చారు. సపోర్ట్ చేసిన ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ అందరికి నా థాంక్స్'' అని చెప్పారు.
శరత్ మరార్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా జర్నీ నా జీవితంలో ఫైనెస్ట్ జర్నీ. కళ్యాణ్ తో వర్క్ చేయడం సంతోషంగా అనిపించింది. టీం కో ఆర్డినేషన్ తో సినిమాను బాగా తీశాం. కళ్యాణ్ గారితి 17 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాను. ఆయనతో ట్రావెల్ చేయడం అంత సులువు కాదు'' అని చెప్పారు.
దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. ''సపోర్ట్ చేసిన మ్యూజిక్ టీం అందరికి థాంక్స్. రామజోగయ్యశాస్త్రి గారు, అనంతశ్రీరాం మంచి సాహిత్యాన్ని అందించారు. ఎంటర్టైన్మెంట్ ను మాస్ ను ఎలా బ్యాలన్స్ చేయాలో.. బాబీ కు బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ తో ఇది వరకు వర్క్ చేశాను. ఈ సినిమాతో మరోసారి ఆయనతో జర్నీ చేసే ఛాన్స్ వచ్చింది'' అని చెప్పారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ''తెలుగు వారి సినిమా బలమెంతో ప్రపంచానికి చాటిచెప్పిన చిరంజీవి గారి కుటుంబం నుండి మరింత సంతోషాన్ని అందించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ వచ్చారు. నిజంగా చెప్పాలంటే నాకు ఈ సినిమా గురించి ఏమి తెలియదు. నేను కూడా సగటు ప్రేక్షకుడిలా సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆవేశం, ఆదర్శం కాళ్లై నడిచే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన గురించి నాకు అదే మాట గుర్తొస్తుంది. అంతా కలిపి నేను పిడికెడు మట్టి కావొచ్చు.. ఒకసారి తలెత్తి చూస్తే ఒక దేశపు జెండాకు ఉన్న పొగరుంది. అలాంటి పొగరును మనస్పూర్తిగా ఇష్టపడుతూ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆయనకు, అందరికి ఆనందాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. వచ్చే ప్రతి సినిమా మన పరిధిని పెంచుతూ.. ముందుకు వెళ్లాలని.. భారతీయ పరిశ్రమ ఒక్కటి కావాలని.. అది ఈ సినిమాతో జరగాలని ఆశిస్తున్నాను'' అని చెప్పారు.
రామ్-లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''పవన్ కళ్యాణ్ గారికి తిక్కుంది.. దానికో లెక్కుంది. ఈ సినిమాలో పవన్ గారిని బాగా ఇబ్బంది పెట్టేశాం. ఆయన చేసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కష్టపడ్డారు. 'గబ్బర్ సింగ్' కంటే ఈ సినిమాలో ఫైట్స్ వంద రెట్లు బావుంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకునే నటిస్తారు. మాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు మా కృతజ్ఞతలు'' అని చెప్పారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన రోజే మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఆ పాటలోని ప్రతి లిరిక్ గురించి ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.దేవిశ్రీప్రసాద్ గారు అధ్బుతమైన బాణీలను అందించారు. ఆయన మ్యూజిక్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. పవన్ గారి సినిమాకు నేను సాంగ్స్ రాయడం అదృష్టంగా భావిస్తున్నాను'' అని చెప్పారు.
ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ.. ''ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయినప్పటి నుండి రెగ్యులర్ గా చూడడానికి వెళ్లాను. నా జీవితంలో ఇంత కష్టపడి పని చేసే హీరోను చూడలేదు. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, మమ్ముట్టి, రజినీకాంత్, మోహన్ లాల్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. కాని కొంతమంది మాత్రమే క్రియేటివ్ హీరోస్ ఉన్నారు. అందులో పవన్ ఒకరు. ఈ సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయడానికి రాత్రింబవళ్ళు అహర్నిశలు కష్టపడ్డారు'' అని చెప్పారు
కబీర్ మాట్లాడుతూ.. ''రాత్రింబవళ్ళు కష్టపడి పని చేశాం. అందరూ హార్డ్ వర్క్ చేశారు. దేవిశ్రీప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్స్ కి థాంక్స్'' అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కాజల్, అనంతశ్రీరాం, సంజన, శరత్, సునీల్ లుల్లా, అలీ, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు.