మహేష్ మహేష్ మహేష్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులంతా మహేష్ నామ జపమే చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మహేష్‌ని దృష్టిలో ఉంచుకొనే కథల్ని సిద్ధం చేసుకొంటున్నారు. ఇప్పటికే అరడజను మంది అగ్ర దర్శకులు మహేష్‌తో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నారు. వాళ్లలో త్రివిక్రమ్, పూరి జగన్నాథ్‌లాంటి అగ్ర దర్శకులు కూడా వున్నారు. తాజాగా మరో దర్శకుడు చెప్పిన కథని విని మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు... విక్రమ్ కె.కుమార్. మనంతో మంచి క్రియేటివిటీ వున్న దర్శకుడు అనిపించుకొన్నాడు విక్రమ్. అప్పట్నుంచి ఆయనతో కలిసి పనిచేసేందుకు స్టార్ కథానాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌కి కథ చెప్పి ఓకే ఒప్పించిన విక్రమ్ తదుపరి మహేష్‌తోనూ సినిమాకి రంగం సిద్ధం చేసుకొన్నాడు. లైన్ విన్న మహేష్ సినిమా చేద్దామని మాటిచ్చాడట. అయితే ఆ సినిమా కాస్త లేట్ అవుతుందని, పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధం చేసుకోవడానికి ఆర్నెళ్లు సమయమైనా కావాలని, ఆ కథ అంత క్లిష్టంగా వుంటుందని విక్రమ్ చెప్పుకొచ్చాడు. చూస్తుంటే మహేష్, విక్రమ్‌లు పెద్ద కథనే ప్లాన్ చేసినట్టున్నారు.