కబాలి దా అంటూ రజనీ చేస్తున్న సందడి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో హోరెత్తిపోతోంది. రజనీ కబాలి టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మేడేని పురస్కరించుకొని నిమిషం వ్యవధి గల టీజర్‌ని విడుదల చేశారు. అందులో రజనీ మాఫియా డాన్ అవతారంలో కనిపిస్తున్నారు. గుబురు గెడ్డంతో స్టైల్‌కే స్టైల్ నేర్పించేట్టుగా కనిపిస్తున్నాడు. రజనీ సూటూ బూటూలోనే కనిపిస్తున్నప్పటికీ టీజర్ మాత్రం మ మ మాస్ అనిపించేలా వుంది. రజనీకాంత్ తనదైన శైలిలో ఓ డైలాగ్ కూడా విసిరాడు. కబాలి డా అంటూ ముగిసే ఆ డైలాగ్ రజనీ అభిమానుల్ని పిచ్చపిచ్చగా ఆకట్టుకుంటోంది. ఇదంతా ఒకెత్తైతే టీజర్ చివర్లో రజనీ యంగ్ స్టైల్ మరో ఎత్తు. ఆ స్టైల్‌లో 80ల్లో రజనీని గుర్తుకు తెప్పించాడు. హెయిర్ స్టైల్ని సరిచేసుకుంటూ వెళ్లిపోయే రజనీ స్టైల్, యాటిట్యూడ్ చూస్తుంటే సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆత్రుత కలుగుతోంది. పి.ఎ.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో రజనీ సరసన రాధికా ఆప్టే నటించింది. చిత్రీకరణ అంతా పూర్తి చేసుకొన్న ఈ సినిమాని జూన్ 3 న విడుదల చేయబోతున్నారు.