అష్టాచమ్మా చేయడానికి ముందు నాని అసిస్టెంట్ డైరెక్టరే. బాపుగారి దగ్గర పనిచేశాడు. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలుగన్న నానికి విధి మరో దారి చూపించింది. కథానాయకుడిని చేసేసింది. ఇప్పుడు యంగ్ హీరోల్లో ప్రామిసింగ్ హీరోగా దూసుకెళుతున్నాడు నాని. అయితే పూర్వాశ్రమంలో ఆయన చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ పనిని గుర్తుకు తెచ్చుకొంటూ త్వరలోనే ఓ సినిమాలో నటించబోతున్నాడు. ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో నాని ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. అందులోనే నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపిస్తాడట. అయితే లేటెస్ట్‌గా తెలిసిన మరో విషయం ఏంటంటే ఆ సినిమాలో రాజమౌళి కామియో చేస్తున్నాడట. ఆయన నిజ జీవితంలోలాగే దర్శకుడి పాత్రలోనే కనిపిస్తాడని తెలిసింది. అంటే రాజమౌళి శిష్యుడిగా నాని కనిపించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న సినిమా కథ రాజమౌళికి బాగా నచ్చిందట. అందుకే దర్శకుడు విరంచి, కథానాయకుడు నాని అడగ్గానే రాజమౌళి కామియో చేయడానికి ఒప్పుకున్నాడట. ప్రస్తుతం నాని జెంటిల్‌మెన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రం తుదిదశకు చేరుకుంది కాబట్టి త్వరలోనే కొత్త సినిమాకోసం రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.