సంధ్య రాజు, అలేఖ్య, వాసుదేవరావు, సంజయ్ రాయ్‌చూర ప్రధాన పాత్రల్లో రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో రూపొందిన ఇండిపెండెంట్ చిత్రం 'నాట్యం'. ఈ మూవీ ప్రదర్శన సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..
మధుసూదన్ మాట్లాడుతూ.. ''1939లో కోయంబత్తూరులో కీర్తిలాల్ జ్యూయలర్స్ మొదలుపెట్టాం. అక్కడ ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. మహిళల కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా నిర్మాణంలో మేం కూడా భాగమయ్యాం. మంచి సందేశాత్మక చిత్రం'' అని అన్నారు.
రేవంత్ మాట్లాడుతూ.. ''కె.విశ్వనాథ్ గారి సినిమాలను చూసి నేను స్ఫూర్తి పొందాను. ఆ ఆలోచనలతో నాట్యానికి సంబంధించిన సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో నాట్యాన్ని నేర్చుకున్న ఓ అమ్మాయి జీవిత గమనంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకన్నాయి. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుందనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. దీని కోసం మంచి అనుభవం ఉన్న డ్యాన్సర్ అవసరమని సంధ్యరాజుగారి ప్రదర్శనను యు ట్యూబ్ లో చూసి ఆమెను సంప్రదించాను. ఆమెకు కథ నచ్చడంతో నటించడానికి ఒప్పుకున్నారు. మా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను'' అని చెప్పారు.
అలేఖ్య మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. సంధ్యరాజు ప్రొఫెషనల్ డ్యాన్సర్ కాబట్టి చక్కగా హావభావాలను పలికించింది. నాట్యం మన సంస్కృతికి సంబంధించింది. ఇలాంటి సినిమాలను అందరూ ఆదరించాలి'' అని అన్నారు.
సంధ్యరాజు మాట్లాడుతూ.. ''ఇలాంటి ఒక ఇన్‌స్పిరేషనల్ సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. అవకాశం ఇచ్చిన రేవంత్‌కు థాంక్స్'' అని అన్నారు.
ఈ చిత్రానికి ప్రశాంత్ విహారి సంగీతం అందించగా, శేఖర్ గంగనమోని, ఎస్.జె.సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ అందించారు. రవితేజ ఎడిటింగ్ వర్క్ చేశారు.