నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం 'ఒక మనసు'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ కోసం పాత పద్దతిని ఫాలో అవుతున్నారు. ఓ ఇరవై ఏళ్ల క్రితం సినిమా రిలీస్ అవుతుందంటే రిక్షా వేసుకొని ఊరుఊరికి తిరిగి సినిమాను ప్రోమోట్ చేసేవాళ్ళు. సరిగ్గా అదే పద్ధతిని ఒకమనసు టీమ్ అనుసరిస్తుంది. ఈ విశేషాల గురించి
చిత్ర నిర్మాత మధురాశ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ''ఈరోజుల్లో సినిమా తీయడం ఒక ఎత్తయితే దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం ఒక ఎత్తు. ఇది వరకు రిక్షా మీద మైక్ పట్టుకొని అన్ని ఊర్లకు తిరుగుతూ.. సినిమా గురించి చెప్పేవారు. దాని వలన పర్యావరణానికి కాలుష్యం ఏర్పడేది. అలా కాకుండా ఎకో ఫ్రెండ్లీ ట్రై సైకిల్స్ మీద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గల ముఖ్య పట్టణాలకు తిరిగి ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇమ్రాన్, పృథ్వి అనే ఇద్దరు వ్యక్తులు చేపడుతున్నారు. గూగుల్ ట్రాకింగ్ డివైస్ ద్వారా ట్రై సైకిల్స్ ఎక్కడ ప్రయాణిస్తున్నాయో తెలుసుకోవచ్చు'' అని చెప్పారు.