మన హీరోలు మంచి నటులే కాదు, మంచి వ్యూహకర్తలు కూడా. ఎప్పుడు ఎవరితో ఎలాంటి సినిమాలు చేయాలో వీళ్లకి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో. అందుకే ఒకొక్క సినిమాతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు తెలివైన నిర్ణయాలు తీసుకొంటూ వెళ్లే కథానాయకుడిగా ప్రభాస్‌కి పేరుంది. బాహుబలితో ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. బాహుబలి 2 తర్వాత ఆయన క్రేజ్ మరింత పీక్స్‌కి వెళుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాగో ప్రభాస్ బాహుబలి 2 చేయాల్సి వుంటుందన్న విషయం తెలిసిపోవడంతోనే బాలీవుడ్ వర్గాలు కామ్ అయిపోయాయి. బాహుబలి 2 విడుదలయ్యాక మాత్రం కచ్చితంగా ప్రభాస్‌ని బాలీవుడ్ ఓన్ చేసుకోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రభాస్ ఇప్పుడు పక్కా స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. సినిమా అంటూ తన దగ్గరికొస్తున్న నిర్మాతలకి సింపుల్‌గా మా బ్యానర్‌లోనే సినిమాలు చేయబోతున్నా అని చెబుతున్నాడు. సొంత సినిమా చేస్తున్నాడట కదా అని నిర్మాతలు కూడా ఏమీ అనుకోకుండా తిరిగి వెళుతున్నారు. ఆయన సొంత బ్యానర్ అంటే యువీ క్రియేషన్సే. బాహుబలి 2 తర్వాత వచ్చే క్రేజ్, ఆ తర్వాత సినిమాకి జరిగే వ్యాపారం అంతా కూడా తన సొంత సంస్థకే చెందాలనేది ప్రభాస్ ఆలోచన. అందుకే ఎవ్వరికీ కమిట్ అవ్వడం లేదు. ఒకవేళ బాహుబలి 2 తర్వాత బాలీవుడ్డో, హాలీవుడ్డో బుక్ చేసుకొంటే ఎలాగో సొంత సంస్థలో సినిమాలే కాబట్టి కొన్నాళ్లు వాటిని పక్కనపెట్టి అటువైపు వెళ్లొచ్చన్నమాట. మొత్తంగా ప్రభాస్ వ్యూహాలు అదుర్స్ అనిపిస్తున్నాయి కదూ!