Advertisementt

నవ్వుల యోగి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ..

Wed 16th Nov 2016 05:33 PM
srinivas reddy,jayammu nischayammu raa movie,srinivas reddy birthday  నవ్వుల యోగి  కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ..
నవ్వుల యోగి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ..
Advertisement
Ads by CJ

బూస్ట్.. ఈ మాట వినగానే రెండు విషయాలు గుర్తొస్తాయఒకటి క్రికెటర్స్ చేసే యాడ్స్, రెండు శ్రీనివాసరెడ్డి కామెడీ.. ఈ ఒక్క డైలాగ్ తోనే అంత ఫెమాస్ అయ్యాడతను  టాలెంట్ అనే నమ్మకంపై టైమింగ్ అనే ఆయుధంతో సినీ కదన రంగంలోకి దూకిన కుర్రాడు శ్రీనివాస్ రెడ్డి.. ఒక్క ఛాన్స్ లాంటి మాటలు అతని కెరీర్ లో చాలానే ఉన్నాయి.. అయినా చిన్నప్పుడు నేర్చుకున్న మిమిక్రీని ఆలంబనగా చేసుకునిముందు బుల్లితెరపై అరంగేట్రం చేశాడు..అటుపై పట్టుదలతో ప్రయత్నించి వెండితెర కలను సాకారం చేసుకున్నాడు.. పూరీ జగన్నాథ్ ఇచ్చిన ఛాన్స్ ను ఇడియట్ సినిమాలో బూస్ట్ అనే డైలాగ్ తో ఉపయోగించుకుని తన కెరీర్ కు తనే బూస్టప్ తెచ్చుకున్నాడు..

ఒక్కో సినిమానూ పేర్చుకుంటూ కమెడియన్స్ కు కల్పతరువు లాంటి టాలీవుడ్ లో తనూ ఓ స్టార్ గా ఎదిగాడంటే దానికి కారణం అతని టైమింగే.. అదే అతని టైమ్ ను మార్చింది... ఈ టైమ్ ఎక్కడి వరకూ వెళ్లిందంటే ఓ సినిమాలో బ్రహ్మానందాన్ని కొట్టే పాత్ర ఉంటే అందుకు శ్రీనివాసరెడ్డే కరెక్ట్ అని దర్శకుడే ఫీలయ్యేంత వరకు... ఇన్ స్టంట్ సెటైర్.. ఇమ్మీడియట్ రియాక్షన్  శ్రీనివాసరెడ్డి బలం..

కష్టేఫలీ.. అన్నమాటకు నిలువెత్తు రూపంగా కనిపిస్తాడు శ్రీనివాసరెడ్డి. యాక్టింగ్ లోనే కాదు.. ఎక్స్ ప్రెషన్స్ లోనూ శ్రీనివాసరెడ్డిది ప్రత్యేక శైలి. ఆ విషయం కేవలం కళ్లతోనే కొండంత నవ్వులు పంచిన కింగ్ సినిమా చూస్తే అర్థమౌతుంది. బ్రహ్మానందంతో కళ్లతో నవ్వులు పలికిస్తూ.. మనసులో మాట్లాడుకునే పాత్రలో అతను చేసిన హంగామా చిన్నది కాదు. కమెడియన్ ఏ పాత్రైనా చేయగలడు అని నిరూపించే ఇలాంటి సీన్స్ అతను చాలానే చేశాడు. ఆర్టిస్ట్ అనేవాడికి బ్రేక్ రావడం చాలా అదృష్టం. వచ్చిన బ్రేక్ ను బ్రేక్ లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్.. ఆ ఇంపార్టెన్స్ ను గుర్తించాడు కాబట్టే.. చాలా తక్కువ టైమ్ లోనే తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి.. అతనికి ఎక్కువ గుర్తింపు తెచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే విచిత్రంగా ఈ అన్ని సినిమాల్లో అతను చాలామంది కమెడియన్స్ తో ‘‘సీన్ షేర్’’ చేసుకుంటాడు. అయినా.. శ్రీనివాసరెడ్డి స్పెషల్ గానే కనిపిస్తాడు. ఇదే అతని బలం.

ఎంతమందిలో ఉన్నాం అని కాదు.. ఎంతమందిని మెప్పించాం అన్న దగ్గరే ఏ ఆర్టిస్ట్ అయినా రిజిస్టర్ అవుతాడు.. అందుకు ఉదాహరణ వెంకీ, ఢీ, రెఢీ వంటి సినిమాలే. ఇక అవతల ఓ స్టార్ హీరో ఉండీ.. పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్నవాడైతే శ్రీనివాసరెడ్డి వంటి కమెడియన్స్ ఏ రేంజ్ లో చెలరేగిపోతారో చూపించిన సినిమా ఆంజనేయులు. దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా ఉండే పాత్ర. హీరోతో సమాంతరంగా నిడివి ఉన్న కమెడియన్ పాత్ర. అలాగే పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన సోలో సినిమా అతని హాస్యవిశ్వరూపాన్ని చూపిస్తుంది. ఇంకా ఈ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఎంతకాలం వేస్తాం అని అతని పాత్రే ఓ సినిమాలో డైలాగ్ చెబుతుంది. సోలోలో అతను హీరోకు ఫ్రెండే. కానీ సినిమా చూస్తే అర్థమౌతుంది.. అతను సోలో కాదు.. అతని చుట్టూ అద్భుతమైన టాలెంట్ అనే వలయం ఉందని.

కమెడియన్స్ హీరోలు కావడం మన దగ్గర కామనే. శ్రీనివాసరెడ్డికీ ఆ ఛాన్స్ వచ్చింది. గీతాంజలి సినిమాతో. హారర్ కామెడీ.. సినిమాలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు. కానీ అతను కమెడియన్ గా కనిపించకూడదు. నిజంగా ఇది ఛాలెజింగ్ రోల్. అయినా ఆ పాత్రలో మెప్పించాడు.. కథ కూడా కలిసొచ్చి విజయమూ అందుకున్నాడు.. గీతాంజలి తర్వాత శ్రీనివాస రెడ్డి కూడా ఇతర కమెడియన్స్ లా హీరోగా ఫిక్స్ అవుతాడనుకున్నారు. కానీ గీతాంజలి హిట్ అయినా తొందరపడకుండా పటాస్, సుప్రీమ్, అ..ఆ.. వంటి సినిమాల్లో మళ్లీ కామెడీ వేషాలు వేస్తూ..రీసెంట్ గా ప్రేమమ్ తో మరోసారి తన కామెడీ టైమింగ్ లో ముంచెత్తాడు. ఇక ఇప్పుడు మరోసారి జయమ్మునిశ్చయమ్మురా అంటూ హీరోగా రాబోతున్నాడు శ్రీనివాస రెడ్డి. సినిమా విడుదలకు ముందే హిట్ కళ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పటికే మొత్తం పరిశ్రమ చేతా ‘‘జయమ్ము నిశ్చయమ్మురా’’ అనిపించుకుంది.. ఏ నటుడికైనా కొన్ని కలలుంటాయి. ఆ కలలు నెరవేరాలంటే అతను నిరంతర కృషిలో ఉండాలి. ఛాలెంజ్ ఫేస్ చేసే ధైర్యంతో ఉండాలి. ఇప్పుడు శ్రీనివాస రెడ్డి ఆ దశలోనే ఉన్నాడు. నిజానికి అతని లక్ష్యం కమెడియన్ గా మిగిలిపోవడమో.. హీరోగా ఆగిపోవడమో కాదు.. నటుడుగా నిరూపించుకోవడం. అందుకు అవకాశం ఉన్న ప్రతి పాత్రలోకీ ఒదిగిపోవడం... అందుకే ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా అంటూ ఆల్రెడీ హిట్ అనిపించుకుంటోన్న సినిమా చేశాను కదా అనే గర్వం ఏ మాత్రం లేకుండా రాబోయే సినిమాల్లో మరిన్ని అద్భుతమైన పాత్రల్లో మనకు కనిపించబోతున్నాడు... అలాగే త్వరలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ మెప్పించబోతున్నాడు. మరి అతను కోరుకుంటోన్న ‘‘మంచి నటుడు’’ అన్న పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ.. జయమ్ము నిశ్చయమ్మురా అనే ఆల్ ది బెస్టులతో..  శ్రీనివాసరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం..

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ