తొలినాళ్లలో కథలు చెప్పడం ఎలాగో నాకు తెలిసేది కాదు. నా మొదటి సినిమా ఆర్య కథను నాలుగు గంటలు పాటు వినిపించాను. చాలా సమయం చెప్పి బోర్ కొట్టించేవాణ్ణి. విజయేంద్రప్రసాద్‌ను కలిసిన తర్వాత కథలు చెప్పే విధానంలో మార్పు వచ్చింది. ఆ తర్వాత నా మూడు సినిమాల కథలను ముఫ్ఫై నిమిషాల్లో వినిపించాను అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. బాహుబలి, భజరంగీ భాయిజాన్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శ్రీవల్లీ. రజత్, నేహహింగే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కథలు వినిపించాలంటే పారిపోయేవాణ్ణి. కానీ విజయేంద్రప్రసాద్‌ను కలిసిన తర్వాత కథలు చెప్పడం ఈజీ అనేది అర్థమైంది. ఆయన కథల్లో థ్రిల్లర్, సైన్స్, చరిత్ర, ప్రేమ అన్ని అంశాలు మిళితమై ఉంటాయి. ప్రతి క్షణం ఆయన నుంచి కొత్త కథలు పుడుతూనే ఉంటాయి. ఆయన కథల్ని వింటూ ఓ సందర్భంలో విజయేంద్రప్రసాద్ గారి కాళ్లమీద పడిపోయాను. శ్రీవల్లీ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది రాజ్‌కుమార్ బృందావనంతో కలిసి ఓ సినిమాను నిర్మించబోతున్నాను అని తెలిపారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ శ్రీవల్లీ సినిమా నా కూతురు లాంటిదే. తల్లి తన బిడ్డను ఎలా పెంచుతుందో అలాగే మా సినిమాను అలా నిర్మిస్తున్నాం.
మనసు ఎన్నో అద్భుతాల్ని సృష్టించగలదు. విశ్వాంతరాలను చూడగలదు. ఆ మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి?అనేది చిత్ర ఇతివృత్తం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గత జన్మసృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేహ అద్భుతమైన నటను ప్రదర్శించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె అంకితభావం చూసి భావోద్వేగానికి లోనయ్యాను. సినిమాలో ఓ సన్నివేశం కోసం టాప్‌లెస్‌గా నటించింది అని చెప్పారు. మంచి సినిమా తీయాలనే కోరికతో విజయేంద్రప్రసాద్‌ను కలిశామని, ఆయన ఓ కథాబలి అని, తన దగ్గరున్న వందకథల్లోంచి ఓ ఆణిముత్యంలాంటి కథతో ఈ సినిమాను చేశారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సునీత చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్ బృందావనం, రజత్, నేహహింగే తదితరులు పాల్గొన్నారు. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్.