బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి బరిలో దూసుకొచ్చేస్తున్నాడు బాస్. విజయవాడ-గుంటూరు మధ్యలో చినకాకాని పరిసరాల్లోని హాయ్‌ల్యాండ్‌లో ప్రీరిలీజ్ వేడుక సంబరాలు స్పీడందుకున్నాయి. ఇప్పటికే అక్కడ భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈలోగానే అఫీషియల్‌గా బాస్ రిలీజ్ పోస్టర్లు వచ్చేశాయ్. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా 'ఖైదీ నంబర్ 150' గ్రాండ్‌గా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంగళగిరి సమీపంలోని - హాయ్‌ల్యాండ్‌లో మెగా సంబరాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 'ఖైదీ నంబర్ 150' ప్రీరిలీజ్ వేడుక కోసం ఓవైపు భారీ స్టేజ్‌సెట్ వేసి 'ఖైదీ నంబర్ 150' డిజైన్‌ని ఏర్పాటు చేశారు. అంతేకాదు బాస్ అభిమానులు.. ఇప్పటికే వేదికవైపు వెళ్లే మార్గం మధ్యలో భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా సెట్ డిజైనర్లు, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అకుంఠిత ధీక్షతో పనిచేసి ఈ వేదికను సిద్ధం చేశాయి. హాయ్‌ల్యాండ్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేదిక అంగరంగ వైభవంగా సిద్ధమైంది.
అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ తను నటించిన సినిమా సాక్షిగా అభిమానుల ముందు ప్రసంగించేందుకు వస్తున్నారు. ఆ కిక్కు మెగా ఫ్యాన్స్‌లో ఓ రేంజులో కనిపిస్తోంది. హాయ్‌ల్యాండ్‌లో మెగా ఫ్యాన్స్ ఒకటే హల్‌చల్. మెగాస్టార్‌ని కనులారా వీక్షించేందుకు.. దగ్గరగా చూసుకునేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. అయితే ఎంత పెద్ద స్థాయిలో అభిమానులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక పరిసరాల్లో ఏర్పాట్లు చేశారు. ప్రాంగణం కిక్కిరిసినా ఎలాంటి తోపులాటలు తలెత్తకుండా భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత బాస్ ఇలా ఓ సినిమా వేదికపైకి, తన అభిమానుల ముందుకు వస్తున్నారు.. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ వేదిక రాజకీయ ప్రసంగాలకు అతీతం. ఇది పూర్తిగా సినిమాకి సంబంధించిన వేదిక కాబట్టి అభిమానులు అంతే ఉత్సాహంగా బాస్ రాకకోసం ఇప్పటి నుంచే ఆత్రంగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ శనివారం సాయంత్రం అభిమానుల ఉత్కంఠకు తెరపడనుంది. సాయంత్రం 5 గంటల నుంచి హాయ్‌ల్యాండ్‌లో మెగా సంబరాలు మిన్నంటనున్నాయి. మెగాస్టార్ ఉత్కంఠ రేకెత్తించే స్పీచ్‌తో అలరించేందుకు ఇంకెంతో టైమ్ లేదు. జస్ట్ వెయిట్.