ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భార్య అనిత ఈ రోజు శనివారం గుండెపోటుతో హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో మరణించారు. అనిత వయస్సు 45 సంవత్సరాలు. ఇంత చిన్న వయసులో ఆమె మరణించడం బాధకలిగించే విషయమని అంటున్నారు. అనిత గుండె నొప్పితో బాధపడుతుండాగా.. ఆమెను హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆమె మరణించినప్పుడు దిల్ రాజు 'ఫిదా' చిత్ర షూటింగ్ నిమిత్తం అమెరికాలో వున్నారు. ఈ విషయం తెలియగానే ఆయన హుటాహుటిన హైదరాబాద్ కి బయలు దేరారు. ఇక ఆయన ఇక్కడికి వచ్చే వరకు అనిత మృతదేహాన్ని అపోలో హాస్పిటల్ లోనే ఉంచుతారని సమాచారం. అనిత మరణంతో దిల్ రాజు కుటుంబ సభ్యులు దుఖ్ఖ సాగరంలో మునిగిపోయారు. దిల్ రాజు కి పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.