జయగారు తీసిన 'లవ్‌లీ' కంటే 'వైశాఖం' పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్
ఒక చిన్న సినిమా టీజర్‌కి 2.5 మిలియన్ వ్యూస్ రావడమనేది మామూలు విషయం కాదు. 'వైశాఖం' అనే మంచి తెలుగు టైటిల్‌తో డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయనే దానికి యూ ట్యూబ్‌లో వచ్చిన వ్యూసే నిదర్శనం. హరీష్, అవంతిక జంటగా రూపొందిన ఈ చిత్రానికి డి.జె.వసంత్ సంగీతాన్నందించారు. ఆల్రెడీ పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. విజువల్‌గా కూడా పాటలు చాలా అద్భుతంగా వున్నాయని సినీ ప్రముఖులు అప్రిషియేట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత బి.ఎ.రాజు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి మరో కొత్త టీజర్‌ను జూన్ 5న హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు. అలాగే 'వైశాఖం' థీమ్ టీజర్ 2.5 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా వి.వి.వినాయక్ కేక్‌ను కట్ చేసి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. జయగారు చేసిన సినిమాల వల్ల ఎవరికీ ఒక్క రూపాయి పోలేదు.
ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - 'ఇది శ్రీమతి జయగారికి ఎనిమిదో సినిమా. ఎనిమిది సినిమాలు డైరెక్ట్ చెయ్యడమంటే తమాషా కాదు. లేడీ డైరెక్టర్‌గా విజయనిర్మలగారి తర్వాత అన్ని సినిమాలు డైరెక్ట్ చేసిన ఘనత మన తెలుగు ఇండస్ట్రీలో జయగారికే దక్కుతుంది. ఇప్పటివరకు జయగారు డైరెక్ట్ చేసిన సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి, ఏవరేజ్ సినిమాలు అయ్యాయి. అయితే ఆ సినిమాల వల్ల ఎవరికీ ఒక్క రూపాయి కూడా పోలేదు. కొనుక్కున్న వాళ్ళకి, తీసిన వాళ్ళకి ఎవరికీ నష్టం రాలేదు. అందరికీ హ్యాపీగా డబ్బులొచ్చే సినిమాలే తీశారు. జయగారు మాట్లాడుతూ చిన్న సినిమా అన్నారు. జయగారు తీసే సినిమాల్లో హీరో, హీరోయిన్ కొత్తవాళ్ళు అవ్వడం వల్ల చిన్న సినిమా అనిపిస్తుందేమోగానీ, ఖర్చు విషయంలో మాత్రం ఎక్కడా వెనకాడరు. చాలా బాగా ఖర్చు పెడతారు. ఇది చిన్న సినిమా కాదు. చాలా పెద్ద సినిమా. పాటలన్నీ చాలా లావిష్‌గా తీశారు. అలాగే బి.ఎ.రాజుగారంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం. హీరో కృష్ణగారితో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎక్కువ సినిమాలు చేశాను. కృష్ణగారితో బి.ఎ.రాజుగారికి మంచి అనుబంధం వుంది. నేను, రాజుగారు కలుసుకున్నప్పుడు కృష్ణగారి గురించి మాట్లాడుకుంటాం. ఈ సినిమాలో పాటలు చాలా రిచ్‌గా తీశారు. హీరో కూడా డాన్స్ కూడా బాగా చేశారు. మ్యూజిక్ చాలా బాగుంది. ఫోటోగ్రఫీ కూడా బాగుంది. ట్రైలర్‌లో సాయికుమార్‌గారు చెప్పిన 'తీసుకెళ్ళే దేవుడి కంటే మనల్ని మోసుకెళ్ళే మనుషులే ముఖ్యం' అనే డైలాగ్ చాలా బాగుంది. జయగారు తీసిన 'లవ్‌లీ' పెద్ద హిట్ అయింది. దానికంటే 'వైశాఖం' ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు.
సంగీత దర్శకుడు డి.జె.వసంత్ మాట్లాడుతూ - 'ఈ సినిమాకి మ్యూజిక్ చేసేటపు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. సినిమా ఔట్‌పుట్ చూసి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. రీరికార్డింగ్ తర్వాత నాకు కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరిగింది. థీమ్ టీజర్ పెద్ద హిట్ అయి తక్కువ టైమ్‌లోనే 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్నిబట్టి సినిమాని అందరూ చూడాలని ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. డెఫినెట్‌గా మీ అంచనాలకు మించి సినిమా వుంటుంది. ఈ సంవత్సరం 'వైశాఖం'తో ఒక పెద్ద హిట్ సినిమా వస్తుందని ఆశిస్తున్నాను' అన్నారు.
సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ - 'ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వినాయక్‌గారికి కృతజ్ఞతలు. నిన్న ఫైనల్ ఔట్‌పుట్ చూడగానే నాకు ఓ విషయం తెలిసింది. సాధారణంగా హీరోయిన్ క్యారెక్టర్ గుడ్ అని చెప్పడానికి లంగా ఓణి, సల్వార్ కమీజ్ వంటి కాస్ట్యూమ్స్‌ని వాడతారు. కానీ, ఈ సినిమాలో మేడమ్ జయగారు హీరోయిన్ క్యారెక్టర్‌ని మోడరనైజ్డ్ డ్రెస్‌లతో ఒక గ్రేట్ క్యారెక్టరైజేషన్‌ని హీరోయిన్‌కి క్రియేట్ చేశారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది' అన్నారు.
డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. మాట్లాడుతూ - 'ఈ ఫంక్షన్‌కి విచ్చేసిన వినాయక్‌గారికి థాంక్స్. వినయ్‌గారంటే మాకు చాలా చాలా ఇష్టం. మేం ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడుకుంటూ వుంటాం. నిజంగానే ఆయన మంచి మనిషి, అంతకుమించి మంచి దర్శకుడు మన ఇండస్ట్రీలో లేరు. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక చిన్న సినిమా టీజర్ వారం రోజుల్లో 2.5 మిలియన్ వ్యూయర్స్‌ని ఆకట్టుకుందంటే మామూలు విషయం కాదు. అంత మంది సినిమా కోసం వెయిట్ చేస్తున్నారని తెలుస్తోంది. డెఫినెట్‌గా వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది' అన్నారు.
నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - 'వినాయక్‌గారు ఎంతో బిజీగా వున్నప్పటికీ మా ఫంక్షన్ విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థాంక్స్. మా 'వైశాఖం' చిత్రం థీమ్ టీజర్‌కి ఒక్క వారంలోనే 2.5 మిలియన్ వ్యూస్ వచ్చినందుకు మేమంతా ఎంతో హ్యాపీగా వున్నాం. వచ్చిన వ్యూస్ వల్ల సినిమా కోసం అందరూ ఎంతో ఎదురుచూస్తున్నారని అర్థమవుతోంది. మా బేనర్‌లో వచ్చిన 'లవ్‌లీ' ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 'వైశాఖం' దానికి రెట్టింపు విజయాన్ని సాధిస్తుందని ఎంతో కాన్ఫిడెంట్‌గా వున్నాము' అన్నారు.
నటుడు పృథ్వీ మాట్లాడుతూ - 'నిన్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. దానికి ముందు అందరూ పూజ చేస్తున్నారు. మేడమ్ థాట్స్ ఎంత అడ్వాన్స్‌డ్‌గా వుంటాయంటే 'వైశాఖం'లో ఈ పూజను ఎప్పుడో తీశారు. నేను ఇమ్మీడియట్‌గా రాజుగారికి ఫోన్ చేసి మన సినిమాలోలాగే ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు. మన సినిమా ఇక్కడే సూపర్ డూపర్‌హిట్ అయిందని చెప్పాను. ఇండియా మ్యాచ్ కూడా గెలిచింది కాబట్టి మనమే విన్నర్స్. వైశాఖం సినిమాకి మేమందరం కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. అపార్ట్‌మెంట్‌లో వున్న కల్చర్‌ని ఈ సినిమాలో చూపించారు. సాంప్రదాయాల్ని మర్చిపోయి ఎవరి దారిన వాళ్ళు వెళ్తుంటారు. మనమంతా సిటీకి వచ్చి ఉమ్మడి కుటుంబాలకి దూరంగా వున్నాం. అప్పుడప్పుడు మన పల్లెటూళ్ళకి వెళ్ళినపుడు అందరూ ఆప్యాయంగా పలకరించే తీరు చూస్తే మనమంతా సిగ్గు పడాలి. అపార్ట్‌మెంట్‌లోని అనుబంధాల గురించి చాలా అద్భుతంగా ఈ సినిమా తీశారు. ఎప్పుడెప్పుడు సినిమా చూడాలా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నాకో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత మహిళా ప్రేక్షకులు అంతా కంటతడి పెట్టుకొని బయటికి రావాల్సిందే. అంత బాగా తీశారు. రాజుగారి సినిమా బేనర్‌లో సినిమా చెయ్యడమంటే ఆర్టిస్టులందరికీ చాలా హ్యాపీ. ఎందుకంటే షూటింగ్‌లో ఆర్టిస్టులందరికీ రాయల్ ట్రీట్‌మెంట్ వుంటుంది. నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఈ ప్రొడక్షన్‌లా ఏదీ వుండదు. ఈ సినిమా ఘనవిజయం సాధించి, మంచి డబ్బు రావాలి, మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.
హీరో హరీష్ మాట్లాడుతూ - 'మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన వినాయక్‌గారికి థాంక్స్. సినిమా రిలీజ్‌కి ముందే నా డ్రీమ్ డైరెక్టర్స్ అందరితోనూ కలిసి పాటలు చూసే అవకాశం కలిగింది. అది బి.ఎ.రాజుగారివల్లే అవుతుంది. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు నేను ఎప్పుడూ బి.ఎ.రాజుగారికి, మేడమ్‌గారికి థాంక్స్ చెప్తూనే వుంటాను. సినిమా చాలా బాగా వచ్చింది. పాటలు చూశారు. దాన్ని మించి సినిమా వుంటుంది. మీరంతా సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను' అన్నారు.
హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ, గుండు సుదర్శన్, అప్పారావు, శేషు, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీధర్, రాంప్రసాద్, ప్రసాద్, తేజ, శశాంక్, లతీష్, కీర్తి నాయుడు, పరమేశ్వరి, గోవిందరావు, వీరన్న చౌదరి, రాజా బొయిడి, లత సంగరాజు, లావణ్య, మోనిక, చాందిని, ఇషాని కళ్యాణి కామ్రే, షాజహాన్ సుజానే, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: వాలిశెట్టి వెంకటసుబ్బారావు, సంగీతం: డి.జె.వసంత్, డాన్స్: వి.జె.శేఖర్, ఆర్ట్: మురళి కొండేటి, ఫైట్స్: వెంకట్, రామ్ సుంకర, స్టిల్స్: శ్రీను, కో-డైరెక్టర్: అమరనేని నరేష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సుబ్బారావు, లైన్ ప్రొడ్యూసర్: బి.శివకుమార్, నిర్మాత: బి.ఎ.రాజు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, ఎడిటింగ్, దర్శకత్వం: జయ బి.