మెగాస్టార్ 151వ సినిమా `సైరా నరసింహారెడ్డి` మోషన్ పోస్టర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయడం అదృష్టంగానూ..గౌరవంగాను భావిస్తున్నాను: దర్శకధీరుడు రాజమౌళి
మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ‘సైరా నరసింహారెడ్డి’ టైటిల్‌ను చిత్రానికి ఖరారు చేశారు. టైటిల్ లోగోను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పోస్టర్స్ ను మెగా వారసుడు వరుణ్ తేజ్, సీనియర్ రచయితలు పరుచూరి బ్రదర్స్ (వెంకటేశ్వరరావు-గోపాలకృష్ణ) చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్నికొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
మోషన్ పోస్టర్ రిలీజ్ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి మాట్లాడుతూ...మోషన్ పోస్టర్ ఫెంటాస్టిక్ గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో వస్తోన్న ఆ మ్యూజిక్... ఆ కలర్స్, మెగాస్టార్ ముఖం చూపించకుండా వెనుక నుంచి డిజైన్ చేసిన ఆ లుక్ అదిరిపోయింది. అమితాబచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు వంటి స్టార్ క్యాస్టింగ్ సూపర్బ్ గా ఉంది. `బాహుబలి` సక్సెస్ అయిందంటే టెక్నీషియన్లే కారణం. ఈ సినిమాకు కూడా స్టార్ టెక్నిషీయన్స్ పని చేస్తున్నారు. రెహమాన్ మ్యూజిక్, పరుచూరి కలం బలంకు తిరుగులేదు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి 24 శాఖలపై మంచి పట్టున్న టెక్నీషియన్. ఇవన్నీ చూస్తుంటే చిరంజీవి గారి 151వ సినిమాలా కాకుండా ఆయన మొదటి సినిమాలా ఉంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయడం అదృష్టంగానూ..గౌరవంగాను భావిస్తున్నాను. కొణిదెల ప్రొడక్షన్స్ మరో పెద్ద సక్సెస్ షురూ చేయడం ఖాయం.. అని అన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ..మిమ్మల్నీ అందర్నీ చూస్తుంటే నాకు ఓ సందేహం వస్తుంది. మీరంతా మా అభిమానులా? లేక మేము మీ అభిమానులమా? అని. ఇక నా కెరీర్ లో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ అందించిన రాజమౌళి గారి చేతుల మీదుగా ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. గత నెల రోజులుగా నాన్నగారి పుట్టిన రోజు సందర్భంగా అమెరికాలోని 51 సెంటర్లలలో 2000 మంది ప్రజలు, ఏపీ, తెలంగాణ, ఇతర దేశాల్లో మొత్తం కలిపి 42000 వేల మంది బ్లడ్ డోనేట్ చేశారంటే నిజంగా మీ అందరికీ హ్యాట్సాఫ్. మీరు మెగా అభిమానులు కాదు. మెగా బ్లడ్ బ్రదర్స్ అని నాన్నగారు ఎందుకన్నారో ఇప్పుడు తెలుస్తుంది. నాన్నగారికి దీనికి మించిన బర్త్ డే గిప్ట్ మరొకటి లేదు. సినిమాలు వస్తుంటాయి...పోతుంటాయి. కానీ ఈ రిలేషన్ షిప్ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. సినిమా విషయానికి వస్తే.. గత వారం రోజులుగా అంతా చాలా టెన్షన్ పడుతున్నాం. ఇది ఎలా ప్రజెంట్ చేయాలి? ఎప్పుడు ప్రజెంట్ చేయాలని? రాజమౌళి గారు `బాహుబలి` లాంటి సినిమా చేసి ఇండియాకు బిగ్గెస్ట్ హిట్ ఎలా ఇచ్చారో ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. ఆంజనేయ స్వామి శక్తి వల్లే మేము అడిగిన వెంటనే అమితాబ్, సుదీప్, విజయ్ పేతుపతి వంటి స్టార్లు అంతా మా సినిమాలో భాగమయ్యారు. వాళ్లంతా అడిగిన వెంటనే కాదనకుండా ఒప్పుకున్నారు. అందుకు వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే నాన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు... అని అన్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ..ఈ రోజు రెండు రాష్టాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు చేస్తున్న పండగ రోజు ఇది. చిరంజీవిగారు సినీ పరిశ్రమకు వచ్చి 40 ఏళ్లు పూర్తయింది. అందులో నాది ఆయనతో 37 ఏళ్ల జర్నీ. అందులో నాకు ఎంత తృప్తి ఉంటుందో మీరు ఊహించుకోగలరు. ఆయన కష్టంతో ఓ తారు రొడ్డు వేశారు. అందువల్లే పవన్ కల్యాణ్ దగ్గర నుంచి రామ్ చరణ్, బన్నీ, వరుణ్, తేజ్, శిరీష్ అంతా ఆ రోడ్డులోనే నడుస్తున్నారు. మెగాఫ్యామిలీ హీరోలకు అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తున్నాయి. అదంతా మీ అభిమానుల వల్లే సాధ్యమైంది. రాజమౌళి గారు చేతుల మీదుగా ఈ ప్రచార చిత్రాన్ని లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన వల్లే తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరింది. ఆయన వ్యక్తిగతంగాను మంచి మనిషి. ఇక రామ్ చరణ్ కెరీర్ లో రెండు పెద్ద హిట్లు ఇచ్చినందుకు నేను చాలా ఆనంద పడుతున్నాను. `సైరా నరసింహారెడ్డి` చిత్రాన్ని మాకు అత్యంత ఆప్తుడైన సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చరిత్ర ఎప్పుడు? ఎందుకు ఎవరిని ఎంచుకుంటుందో తెలీదు. ఈసారి సూరి వంత్తైంది. ఆయన ఈ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా తెరకెక్కించాలి. మరుగున పడిపోయిన చరిత్రకారుడి కథను నా మేనల్లుడు రామ్ చరణ్ నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. సైరా ఇండియన్ సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది... అని అన్నారు.
చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ...`సైరా నరసింహారెడ్డి' పేరు చెబితేనే నాకు ఒణుకు పుడుతుంది. చాలా పెద్ద బాధ్యత నాపై పెట్టారు. నా ఫోకస్ మొత్తం సైరా పైనే. దాన్ని బ్లాక్ బస్టర్ చేయడమే నా ముందున్న లక్ష్యం. నాకు మెగాస్టార్ చిరంజీవిగారు, రామ్ చరణ్ సపోర్ట్ ఉంది. దాంతో నా కుటుంబ సభ్యులు, మెగా అభిమానుల సహకారం కూడా ఉంది.. అని అన్నారు.
ప్రత్యేక వీడియో ద్వారా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అభిమానులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తక్కిన పుట్టిన రోజులు కంటే ఈరోజు నాకు చాలా ప్రత్యేకం. దానికి కారణం నా వృత్తి సినిమా...నా ప్రవృత్తి సినిమా. ఈ రెండు అనుభూతులను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు చేసిన పూజలో లేక నేను చేసుకున్న పుణ్యమో గానీ ఇంత మంది అభిమానులను నాకిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగానూ ఇంతే అదరణ చూపిస్తున్నారు. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాంటిది మీ కోసం ఏం చేయడానికైనా సిద్దంగా ఉన్నాను. మీరు గర్వపడేలా సినిమాలు చేయగలను. పది కాలల పాటు చెప్పుకునే పాత్రలు చేయగలను. అందుకే 151వ సినిమాగా స్వాంత్రత్య సమర మోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తీసుకున్నాం. ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర చేయాలని ఎప్పటి నుంచో ఉంది. అందులో భగత్ సింగ్ పాత్రలో నటించాలని చాలా సార్లు అనుకున్నాను. ఇన్నాళ్లకు ఉయ్యాలవాడ రూపంలో నా ఆశలకు..మీ ఆకాంక్షలకు ప్రతి రూపంగా నిలిచే పాత్ర దొరికింది. మన స్వాంత్రత్య పోరాటానికి ఆధ్యులు, పోరాడే యోదులందరికీ ఆరాధ్యులు మన తెలుగు బిడ్డ అయిన ఉయ్యాలవాడ పాత్ర దొరకడం గొప్ప అవకాశం. అత్యాధునికి సాంకేతిక బృందంతో, విలువలతో డైనమిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. సినిమా కోసం ఆయన తీసుకున్న శ్రద్ద, శక్తులకు కృతజ్ఞతలు. ఈ సినిమా అద్భుత దృశ్యకావ్యం అవుతుందడంలో ఎలాంటి సందేహం లేదు. మెగా అభిమానులంతా గర్వపడే సినిమా అవుతుంది. అందుకు మీ సహకారం ఉండనే ఉంది. ఈ నమ్మకాన్ని మరింత పెంచేలా దర్శకబాహుబలి రాజమౌళి గారు ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు గర్వించేలా ఓ చరిత్ర సృష్టించిన దర్శకుడు ఆశీస్సులు అందుకోవడం నిర్మాత చరణ్ కు, ఈ సినిమాకు మంచి శుభ సూచికం.. అని అన్నారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ...చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానిని. ఆయనను ఎంతోమంది అనుకరిస్తారు. అందులో నేను ఒకడిని. ఈ కథ వినగానే చాలా జెలస్సీ ఫీలయ్యాను. `సైరా నరసింహారెడ్డి` తర్వాత సురేందర్ రెడ్డి `సై సై రా సురేందర్ రెడ్డి` అవుతారు.. అని అన్నారు.
రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...వంద రోజులు పడే బొమ్మ అని మోషన్ పోస్టర్ చూడగానే తెలిసిపోయింది. భారతదేశ చరిత్రలో 1857 లో తొలి స్వాంతంత్ర్య పోరాటం ఎక్కడ అంటే ఝాన్సీ రాణి అని పుస్తకాల్లో ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అది మారిపోయి తెల్లవాడిని చూసి తొడగొట్టిన మొనగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చరిత్ర పుస్తకాల్లోకి వచ్చేస్తుంది. మరుగున పడిన చరిత్రకారుడిని ఈ సినిమా వెలుగులోకి తెస్తుంది. `ఖైదీ` నుంచి `ఖైదీ నంబర్ 150`వరకూ చిరంజీవి గారితో మంచి అనుబంధం ఉంది. ఏ రోజు మామధ్య పొరపొచ్చాలు రాలేదు. ఇప్పుడు సైరా నరసింహారెడ్డికి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.. అని అన్నారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ...మావయ్యకు హ్యాపీ బర్త్ డే. ఆయన వల్లే మేమంతా ఇక్కడ ఉన్నాం. మా ఫ్యామిలీ అందరికీ ఒక పౌండేషన్ ఏర్పాటు చేశారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు. ఇక సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్ అదిరిపోయింది. మామూలుగా లేదు. రొమాలు నిక్కపొడిచాయి. ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహించిన వారికి...రక్త దానం చేసిన వారందకికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ ప్రేమాభిమానాలు ఎల్లకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
మెగా వారసుడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ..నా అభిమాన హీరో చిరంజీవిగారే. మా ఫ్యామిలీ హీరోలందరికీ ఆయనే స్ఫూర్తి. ఇప్పుడాయన 151వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది..అని అన్నారు.
ఇదే వేదికపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా దర్శకులు రాజమౌళి, సురేందర్ రెడ్డి, సుకుమార్ లకు ఘనంగా సన్మానం జరిగింది. అలాగే మెగా అభిమానుల సమక్షంలో మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు వైభవంగా జరిగాయి.
ఇదే వేదికపై మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొన్న వారికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ చేతుల మీదుగా అవార్డులు అందించడం జరిగింది. ఈ వేడుకల్లో డా.కె. వెంకటేశ్వరరావు, సాయి ధరమ్ తేజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
`సైరా నరసింహారెడ్డి` చిత్రంలో నటీనటులు అమితాబచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, నాజర్, రవి కిషన్, ముఖేష్ రిషీ, రఘుబాబు, పరుచూరి వెంకటేశ్వరరావు, సుబ్బరాజు, వి. జయ ప్రకాశ్, రఘు కారుమంచి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్. రెహమాన్, ఛాయాగ్రహణం: రవివర్మన్, మాటలు: సాయి మాధవ్ బుర్రా, కథ: పరుచూరి బ్రదర్స్, రచనా సహకారం: సత్యానంద్, భూపతి రాజా, డి.ఎస్. కన్నన్, మధుసూదన్, వేమా రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్, కాస్ట్యూమ్ డిజైనర్: అన్జు మోడి, ఉత్తరా మీనన్, సుష్మిత కొణిదెల, వి.ఎఫ్ ఎక్స్ కోఆర్డినేటర్: శాంత్ పీసీ, స్టిల్స్ : గుణ, పబ్లిసిటీ డిజైనర్ : అనిల్ భాను, రెండవ యూనిట్ డైరెక్టర్ : సంజయ్ శెట్టి, ఫస్ట్ ఏడీ డైరెక్టర్ : విశాల్ రామన్, మొదటి కో డైరెక్టర్ : సత్యం బెల్లంకొండ, రెండవ కోడైరెక్టర్ : ఆర్. ఆర్ గోగు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వాకాడా అప్పారావు, వి.వై ప్రవీణ్ కుమార్, సిఈవో : డా. విద్యా మాధురి, సమర్పణ: సురేఖ కొణిదెల, నిర్మాత: రామ్ చరణ్, కథనం, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.