మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రభాకర్.పి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు నిర్మిస్తోన్న చిత్రం 'బ్రాండ్ బాబు'. సుమత్ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ, మురళీశర్మ ప్రధాన తారాగణంగా నటించారు. ఈ సినిమా టీజర్‌ను డైరెక్టర్ హరీశ్ శంకర్.ఎస్ సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా.. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. నేను తొలిసారి పూర్తిగా మాటలు, స్క్రిప్ట్ అందించిన సినిమా ఇది. కొన్ని సినిమాలకు కాన్సెప్ట్‌లు ఇస్తుంటాను. కానీ ఈ సినిమాకు బౌండెడ్ స్క్రిప్ట్ రాసి..పూర్తిగా శైలేంద్రబాబుగారికి నెరేట్ చేశాను. స్ర్కిప్ట్ విన్న ఆయన ట్రెండ్‌లో ఉన్న పాయింట్.. అందరూ కనెక్ట్ అవుతారనిపించింది. 'డైరెక్టర్ మీలాగా తీయగలుగుతారా?' అని ఆయన ప్రశ్నించారు. చాలా మందిని అనుకున్నాను కానీ.. ఎందుకో ప్రభాకర్‌గారే కరెక్ట్ అనిపించింది. ఒక సినిమా ఫెయిల్ అయితే కథ పెయిల్ అయినట్లే తప్ప.. టెక్నీషియన్ ఫెయిల్ అయినట్లు కాదని నేను నమ్ముతాను. ఫెయిల్యూర్‌కి, టెక్నీషియన్‌కి లింకు పెట్టకూడదని నిర్ణయించుకుని నిర్మాతలు కొన్ని సందేహాలు వెలిబుచ్చినా.. నేను వారికి సమాధానం చెప్పాను. ప్రభాకర్‌గారు స్క్రిప్ట్ విని ఓకే చెప్పగానే.. సినిమా స్టార్ట్ అయ్యింది. నేను ఏదైతే అనుకున్నానో.. దాన్ని ఎగ్జాట్‌గా తెరపై చూపించారు. ఈ సినిమాను అందరూ ప్రేమించి చేశారు. సినిమాను చూసుకున్నాం. చాలా బావుంది. ఈ సినిమా ఇంత రిచ్‌గా రావడానికి నిర్మాతగారే కారణం. జీవన్ సాంగ్స్, ఆర్.ఆర్ విషయంలో చాలా కష్టపడ్డాడు. డెఫనెట్‌గా ఇది సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఆగష్టు మొదటివారంలో సినిమా విడుదల కానుంది.. అన్నారు.
డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. మారుతి ఇంతకు ముందు చాలా సార్లు తన ఫంక్షన్లకు పిలిచాడు. కానీ రాలేకపోయాను. కానీ ఈ సినిమాకు రాకపోతే ఇంకోసారి పిలవనన్నాడు. నాకు చాలా థాట్స్ ఉంటాయి. కానీ నేను రాయడానికి చాలా సమయం పడుతుంది. కానీ మారుతి చాలా సింపుల్‌గా కథ రాస్తాడు. అందుకే నాకు తనంటే విపరీతమైన గౌరవం. మారుతి తొలి సినిమా సక్సెస్ కాగానే, తన చుట్టుపక్కనున్న వారి సక్సెస్ గురించి ఆలోచించాడు. మారుతి మల్టీటాస్కింగ్ పర్సన్. ప్రభాకర్‌గారు ఎప్పుడూ బిజీ పర్సన్. సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. 'నెక్స్ట్ నువ్వే' సినిమాతో మంచి టెక్నీషియన్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. మనం చేయాలనుకున్న పని చేయడమే సక్సెస్. అది నలుగురికీ నచ్చడం బోనస్. హీరో చాలా బాగా చేశాడు.. అని అన్నారు.
డైరెక్టర్ ప్రభాకర్.పి మాట్లాడుతూ.. నేను డైరెక్టర్ అవుదామనుకున్నప్పుడు అరవింద్‌గారు, జ్ఞానవేల్‌రాజాగారు, యువీ క్రియేషన్స్ వంశీగారు, బన్ని వాసుగారు ఓ కొత్త బ్యానర్‌ను స్టార్ట్ చేసి అవకాశం ఇచ్చారు. వారికి నేనెంతగా రుణపడి ఉంటానో.. అంతకు కాస్త ఎక్కువగానే మారుతిగారికి రుణపడి ఉంటాను. సినిమా సక్సెస్ అయితే ఎవరైనా అవకాశం ఇస్తారు. అంతంత మాత్రమే ఆడిన నా సినిమా చూసి నువ్వు బాగానే డైరెక్ట్ చేశావ్ అని మారుతిగారు మెచ్చుకుని నాకు డైరెక్షన్ చాన్స్ ఇచ్చారు. మారుతిగారు సక్సెస్ అయిన తొలి రోజు నుండి కొత్త వారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు. ఆయన గొప్ప స్థాయికి రావాలి. నేను సక్సెస్ అయ్యానని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మారుతిగారు రాసిన స్క్రిప్ట్‌ను డీల్ చేసి.. నేను ఎలా తీస్తానో అలాగే తీసావయ్యా అనిపించుకున్న తర్వాత నాలో నమ్మకం పెరిగింది. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. మా నిర్మాత శైలేంద్రగారికి డబ్బులు గురించి టెన్షన్ లేదు కానీ.. సినిమా బాగా రావాలని ఎప్పుడూ చెబుతుండేవారు. జెబి భవిష్యత్‌లో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. అద్భుతమైన పాటలే కాదు.. రీరికార్డింగ్ కూడా అద్భుతంగా చేశాడు. కార్తీక్ పళని ఎక్స్‌ట్రార్డినరీ విజువల్స్ ఇచ్చారు. ఈషాగారు చక్కగా నటించారనడం కంటే జీవించారనే చెప్పాలి. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్.. అన్నారు.