సస్పెన్స్ థ్రిల్లర్ "గతం" సక్సెస్ మా అందరకీ కొత్త భవిష్యత్తుని ఇచ్చింది.
ఆఫ్ బీట్ ఫిల్మ్స్, ఎస్. ఒరిజినల్స్ సంయుక్తంగా.. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో రూపుదిద్దుకున్న చిత్రం ‘గతం’. సైకలాజికల్ థ్రిల్లర్‌గా లేక్ టాహో నేపథ్యంలో అంతా అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం నవంబర్ 6న ఓటీటీ రంగంలో అగ్రగామి సంస్థగా దూసుకుపోతోన్న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదలైంది. భార్గవ్ పొలుదాసు, రాకేశ్ గలిబె, పూజిత ప్రదాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు కిరణ్ కొండమాడుగుల. విడుదలైన రోజు నుంచే ఫుల్ పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న సందర్భంగా చిత్ర తారాగణం అయిన భార్గవ్, రాకేశ్, పూజితలు, దర్శకుడు కిరణ్ వారి ఆనందాన్ని తెలుగు సినీ పాత్రికేయులతో పంచుకున్నారు. సినిమాలో అంతా కొత్త వారైనప్పటికీ కథలో ఉన్న కంటెంట్ ను చూసి మమ్మల్ని ఆదిరిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటామని దర్శకుడు కిరణ్ అన్నారు. అలానే మా ఈ చిన్న సినిమాను అమెజాన్ వారు తమ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసి దాదాపు 200 దేశాల్లో ఉన్న సినిమా అభిమానులకి పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు హీరో రాకేశ్, హీరోయిన్ పూజిత మాట్లాడుతూ రెండేళ్ల పాటు తమ చిత్ర బృందం పడిన శ్రమకు ప్రతి ఫలం దక్కడం చాలా ఆనందంగా ఉందని, ఇంక సినిమాల్లో మేమంతా రాణించగలం అనే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చిందని అన్నారు. నిర్మాత, నటుడు భార్గవ్ మాట్లాడుతూ అమెజాన్ వారు ఈ సినిమాను తీసుకోవడంతోనే మేమంత సక్సెస్ అయ్యాము, ఆ తరువాత తెలుగు సినీ పాత్రికేయులంతా మమ్మల్ని ప్రొత్సహించి, ఆడియెన్స్ కు మమ్మల్ని చాలా పాజిటివ్ గా పరిచయం చేశారు, వీటితో పాటు కిరణ్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకోవడంతో మా గతం చిత్రం మా అందరకీ ఇండస్ట్రీలో ఓ భవిష్యత్తు ఉండబోతుందనే నమ్మకం కలిగించింది అన్నారు.