Advertisementt

పాట విడుద‌లైన సంవత్సరానికి సినిమా!

Thu 21st Jan 2021 10:28 AM
sv babu film producer,sv babu producer interview,30 rojullo preminchadam ela movie,producer sv babu  పాట విడుద‌లైన సంవత్సరానికి సినిమా!
sv babu producer interview పాట విడుద‌లైన సంవత్సరానికి సినిమా!
Advertisement
Ads by CJ

నీలి నీలి ఆకాశం పాట విడుద‌లైన 365 రోజుల‌కు 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా సినిమాని విడుద‌ల చేస్తున్నాం.. నిర్మాత ఎ‌స్‌.వి. బాబు.

పాపుల‌ర్ యాంక‌ర్ ప్ర‌దీప్ మాచిరాజు 30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా? అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. సుకుమార్ ద‌గ్గ‌ర ఆర్య 2, 1.. నేనొక్క‌డినే చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు. క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. జీఏ2-యువి క్రియేష‌న్స్ ద్వారా జ‌న‌వ‌రి 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి ఆయ‌న స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం మీడియా ప్ర‌తినిధుల‌కు ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూ విశేషాలు..

నీలి నీలి ఆకాశం పాట ఇంత బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌వుతుంద‌ని ఊహించారా? ఎలా ఫీల‌వుతున్నారు?

రెండు రాష్ట్రాల ప్ర‌జ‌లు మా సాంగ్‌ను ఇంత పెద్ద హిట్ చేసినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. న‌న్నే ఎంతోమంది అడిగారు.. ఈ సాంగ్ విన్నారా?  చాలా బాగుంటుంది.. ఈ సినిమాని క‌న్న‌డ‌లో చేయొచ్చు క‌దా? అని. నేను క‌న్న‌డ‌లో రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేస్తుంటాను కాబ‌ట్టి న‌న్ను తెలిసిన‌వాళ్లంద‌రూ ఆ సాంగ్ గురించి నాకే చెప్పారు. అప్పుడు నేను మొబైల్‌లో పోస్ట‌ర్ చూపించి, అందులో నా పేరు చూపిస్తేనే కానీ అది నా సినిమా అనే విష‌యం వాళ్ల‌కు తెలీదు. క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టి దాకా ఈ సినిమా గురించి మేం ప‌బ్లిసిటీ చేసుకోలేదు. ఆ సాంగ్ అంత పెద్ద హిట్ట‌వుతుంద‌ని మేం ఊహించ‌లేదు. రిలీజ్ చేసిన‌ప్పుడు 5 మిలియ‌న్ వ్యూస్ వ‌స్తే చాల‌నుకున్నాం. అది దాదాపు ఇప్ప‌టికి 278 మిలియ‌న్ వ్యూస్ దాకా వెళ్లింది. ఆ సాంగ్ విష‌యంలో మా టీమంతా చాలా సంతోషంగా ఉంది. అలాగే మ‌రో పాట కూడా 20 మిలియ‌న్ వ్యూస్ సాధించింది. స్నేహం మీద చేసిన సాంగ్‌కు సుమారు 10 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. నేను క‌న్న‌డంలో నిర్మించిన సినిమాల్లోని పాట‌లెన్నో చాలా పెద్ద హిట్ట‌య్యాయి. వాట‌న్నింటినీ మించి ఇంకో మెట్టు పైకి వెళ్లింది ఆ సాంగ్‌. ఆ సాంగే సినిమా చూడ్డానికి ప్ర‌జ‌ల్ని తీసుకొస్తుంద‌నే న‌మ్మ‌కం మాకుంది. ఆ సాంగ్ మాత్ర‌మే కాదు.. సినిమా మొత్తం చాలా బాగుంటుంది. నిర్మాత‌గా ఇది నాకు 18వ సినిమా. మిగ‌తా అన్ని సినిమాల‌కంటే ఈ సినిమా చూసిన‌ప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను. డైరెక్ట‌ర్ కొత్త‌వాడైన‌ప్ప‌టికీ సినిమా చూస్తే, ఓ కొత్త డైరెక్ట‌ర్ ఈ సినిమా చేశాడ‌నిపించ‌దు. ఒక బేబీ లాగా ఈ సినిమాని చూసుకున్నాడు. ఈ సినిమా కోసం ప‌డిన క‌ష్ట‌మంతా దాన్ని చూశాక మ‌ర్చిపోయాను. రియ‌ల్లీ డైరెక్ట‌ర్ మున్నాకు హ్యాట్సాఫ్.

ప్ర‌దీప్ గురించి ఏం చెబుతారు?

హీరో ప్ర‌దీప్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అంద‌రూ ఇష్ట‌ప‌డే విధంగా ప్ర‌తి ఫ్రేమ్‌లో ఆయ‌న న‌టించారు. ఆయ‌న న‌ట‌న మా మూవీకి చాలా ప్ల‌స్‌. ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం క‌థ‌. మంచి సెంటిమెంట్‌, కామెడీ ఉన్నాయి. సినిమా రెండు షేడ్స్‌లో ఉంటుంది. ఈ సినిమాని ప్రేక్ష‌కులు త‌మ‌దిగా చేసుకుంటార‌నే ప్ర‌గాఢ న‌మ్మ‌కం నాకుంది.

ఓటీటీకి ఈ సినిమాని ఎందుకు ఇవ్వ‌లేదు?

డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. కానీ మా సినిమా మీద మాకు చాలా న‌మ్మ‌కం ఉంది. ప్ర‌దీప్ గారికి ఇది ఫ‌స్ట్ ఫిల్మ్‌. థియేట‌ర్ల‌లో విడుద‌ల చెయ్యాల‌నే ఉద్దేశంతోటే నేను ఓటీటీ గురించి ఆలోచించ‌లేదు. హీరో కానీ, డైరెక్ట‌ర్ కానీ మీ డ‌బ్బులు మీకు రావాలండీ అన్నారు కానీ, నా ప్రొడ‌క్ట్ మీద నాకున్న న‌మ్మ‌కం వ‌ల్ల ఓటీటీలో నేరుగా రిలీజ్ చెయ్య‌కుండా థియేట‌ర్ల‌లోనే రిలీజ్ చెయ్యాల‌ని నిర్ణ‌యించుకున్నాను.

టైటిల్‌కు, పాట‌ల‌కు వ‌చ్చిన రెస్పాన్స్ కానీ చూశాక‌, అంచ‌నాల‌కు న్యాయం చేసే రీతిలో సినిమా ఉంటుందా?

సినిమా విడుద‌ల‌కు ముందు సాంగ్స్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యి, తీరా రిలీజ‌య్యాక ఫెయిలైన సినిమాలు చాలానే ఉన్నాయి. మేం అనేక విధాలుగా ఆలోచించి, కొన్ని క‌రెక్ష‌న్స్ కూడా చేశాం. ఈ సినిమాని అల్లు అర‌వింద్ గారు, బన్నీ వాసు గారు చూశారు. వాళ్లు ఇష్ట‌ప‌డి వాళ్ల బ్యాన‌ర్ మీద ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారంటే అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విష‌యంలో నేను వెరీ హ్యాపీ. బిజినెస్ విష‌యంలో ఇది నాకు చాలా హెల్ప్ అయ్యింది. సినిమా ఎక్క‌డా కూడా బోర్ కొట్ట‌దు. ప్రేక్ష‌కుల న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌దు. సినిమా చూసిన ప్రేక్ష‌కుడు హాయిగా థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తాడు. అందుకే పాటంత బాగా సినిమా ఉంటుంద‌నే క్యాప్ష‌న్ కూడా వేశాం.

టైటిల్ సినిమాకి ప్ల‌స్ అవుతుందా?

ఇప్పుడు ప‌ద‌హారు రోజుల్లోనే ప్రేమించేస్తున్నారు. ప‌దిహేడో రోజు విడిపోతున్నారు. ఏ క‌థైనా ప్రేమ మీదే మొద‌ల‌వుతుంది. ఓ అమ్మాయి అబ్బాయి మ‌ధ్య ప్రేమ వాళ్ల‌ను ఎంత‌వ‌ర‌కు తీసుకెళ్తుంద‌నేది ఈ సినిమా. అంద‌రూ కూడా వాళ్ల ప్రేమ‌ను ఇష్ట‌ప‌డ‌తారు. సినిమా చూసిన‌వాళ్లెవ‌రూ మ‌మ్మ‌ల్ని తిట్టుకోరు. ప్ర‌తి ఆర్టిస్ట్ త‌మ పాత్ర‌ల‌కు వంద శాతం న్యాయం చేశారు. సినిమా చూసే ముందు నేను కూడా ఇంత న‌మ్మ‌కం పెట్టుకోలేదు. డైరెక్ట‌ర్ ఏది అడిగితే అది స‌మ‌కూర్చాం. ఆన్ స్క్రీన్ క్వాలిటీ కావాల‌నే ఉద్దేశంతో ఏ విష‌యంలోనూ మేం కాంప్ర‌మైజ్ కాలేదు. ఇండ‌స్ట్రీకి చెందిన పెద్ద‌పెద్ద‌వాళ్లు ఈ సినిమా చూశారు. అంద‌రూ ప్ర‌శంసించారు. మ‌రి ప్రేక్ష‌కులు ఏం చెబుతారో ఈ నెల 29 మార్నింగ్ తెలిసిపోతుంది.

సినిమాల్లోకి ఏ ఉద్దేశంతో వ‌చ్చారు?

నేను ప్యాష‌న్‌తో ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాను. నేను హైస్కూల్లో చ‌దివేట‌ప్పుడు అర్జున్ స‌ర్జా వాళ్ల నాన్న‌గారు మాకు డ్రిల్ మాస్టారు. అప్ప‌ట్లో ఆయ‌న సినిమాల్లో విల‌న్‌గా న‌టించేవారు. ఆయ‌న స్కూలుకు నెల‌కు ప‌దిహేను రోజులే వ‌చ్చేవారు. నేను అటూ ఇటూ చ‌క్క‌ర్లు కొట్టి ఆయ‌న క్యాబిన్‌లో ఉండేవాడ్ని. అదొక పిచ్చి నాకు. నేను చిన్న‌వాడినైనా ఎందుకో తెలీదు, త‌న క‌ష్టాల‌ను నాతో షేర్ చేసుకొనేవారు. మీరు బాధ‌ప‌డ‌కండి, నేను సినిమా చేస్తాను.. అనేవాడ్ని. అది నా మ‌న‌సులో ఫీడ్ అయిపోయింది. పెద్ద‌య్యాక నేను వైజాగ్‌లో ట్రావెల్ ఏజెన్సీలు న‌డిపాను. స‌త్య‌నారాయ‌ణ‌గారికి మా కార్లు కూడా తీసుకెళ్లారు. ఓసారి ఎలా ఉంటుందో చూడాల‌ని నాగార్జున గారికి డ్రైవ‌ర్‌గా కూడా వెళ్లిన సంద‌ర్భాలున్నాయి. అప్ప‌ట్లో వైజాగ్‌లో ఉండేవాడ్ని కాబ‌ట్టి ఫిల్మ్ ఇండ‌స్ట్రీ గురించి బాగా స్ట‌డీ చేశాను. అయితే ఫ‌స్ట్ సినిమా క‌న్న‌డంలో చెయ్యాల‌నే ఉద్దేశంతో క‌న్న‌డంలోనే చేశాను. వేరే బిజినెస్‌లు ఉన్న‌ప్ప‌టికీ 15 సంవ‌త్స‌రాల నుంచీ ప్యాష‌న్‌తోనే సినిమాలు చేస్తున్నాను. డ‌బ్బు పోగొట్టుకోకూడ‌ద‌నే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తున్నాను. ఇప్ప‌టిదాకా చేసిన సినిమాల్లో నాలుగైదు సినిమాలు బ్రేకీవెన్ తెచ్చాయి. మిగ‌తా సినిమాలు రిక‌వ‌బుల్ అయ్యి ప్రాఫిట్స్ తెచ్చాయి. క‌న్న‌డంలో చేసిన జోష్ అనే సినిమాకు ఓ వంద అవార్డులు దాకా వ‌చ్చాయి. ఆ సినిమాని తెలుగులో కెర‌టం అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాం. అది ర‌కుల్‌ప్రీత్ సింగ్ ఫ‌స్ట్ ఫిల్మ్‌.

నాగార్జున‌కు డ్రైవ‌ర్‌గా వెళ్లార‌న్నారు క‌దా.. ఏం తెలుసుకున్నారు?

అది కెప్టెన్ నాగార్జున సినిమా టైమ్‌లో. ఆ సినిమా షూటింగ్ అర‌కులో జ‌రిగేట‌ప్పుడు మా కార్లు తీసుకున్నారు. నాగార్జున గారికి ఓ స్పెష‌ల్ కారు కావాల‌ని వెతుకుతున్నారు. అప్ప‌టికే నేను ఓ అంబాసిడ‌ర్ కారును ఏసీ చేసి, నాకోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ కారు గురించి తెలుసుకొని అడిగారు. దాన్ని ఏ డ్రైవ‌ర్ చేతుల్లో పెట్ట‌న‌నీ, దాన్ని నా సొంతానికి మాత్ర‌మే ఉప‌యోగిస్తుంటాన‌నీ చెప్పాను. నాగార్జున గారి కోసం అడుగుతున్నామ‌ని వాళ్లు చెప్ప‌డంతో, నేనే న‌డుపుతాన‌ని చెప్పి వెళ్లాను. అలా ఏడెనిమిది రోజులు అర‌కులో ఉన్నాను.

ఇన్ని సినిమాలు చేశాక నిర్మాత‌గా ఏమ‌నిపిస్తోంది?

ఎలా మంచి సినిమాలు తీసి, ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ఆలోచిస్తుంటాను. తీసిన సినిమాని ఏ విధంగా రిలీజ్ చెయ్యాల‌ని అని ఆలోచిస్తున్నాను. సినిమా తియ్య‌డంలో క‌ష్టం 25 శాత‌మైతే, దాన్ని రిలీజ్ చెయ్య‌డంలో క‌ష్టం 75 శాతం.

మున్నా డైరెక్ష‌న్‌లో సినిమా తియ్యాల‌ని ఎందుక‌నిపించింది?

భ‌ద్రం గారి ద్వారా మున్నా ప‌రిచ‌య‌మ‌య్యారు. భ‌ద్రం మా ఫ్యామిలీ లాంటివారు. వాళ్ల మామ‌య్య‌, నేను బ్ర‌ద‌ర్స్ లాగా ఉంటాం. కొత్త‌వాళ్ల‌తో సినిమా చెయ్యాల‌ని ఉంద‌ని భ‌ద్రం గారితో అన్నాను. ఆయ‌న మున్నాగారి గురించి చెప్పారు. అదివ‌ర‌కు చాలా మందితో నేను డిస్క‌ష‌న్లు జ‌రిపాను. మున్నాగారు వ‌చ్చి మా అబ్బాయికి క‌థ చెప్పారు. త‌న‌కు బాగా న‌చ్చింది. నాలుగు రోజుల త‌ర్వాత నేను విన్నాను. బాగా న‌చ్చేసింది.

హీరో హీరోయిన్ల‌ను డైరెక్ట‌రే ఎంపిక చేశారా?

అలా ఏమీ కాదు. టీమ్ అంతా చ‌ర్చించుకొని హీరో హీరోయిన్ల‌ను ఎంపిక చేశాం. హీరోయిన్ కోసం చాలా వెతికాం. అమృతా అయ్య‌ర్ మా ఆఫీస్‌కు త‌న ఫొటోల‌ను పంపి ఉంది. ఆ ఫొటోలు నాకు న‌చ్చి, డైరెక్ట‌ర్‌కు పంపితే, ఆయ‌న‌కూ హీరోయిన్ క్యారెక్ట‌ర్‌కు ఆమె స‌రిగ్గా స‌రిపోతుంద‌నిపించింది. ఆమెది స్వ‌త‌హాగా బెంగ‌ళూరే అయినా త‌మిళ సినిమాలు చేస్తూ ఉంది.

ఈ నెల 22 మీ బ‌ర్త్‌డే క‌దా?

అవునండీ.. కానీ నా బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం నాకిష్టం ఉండ‌దు. న‌ల‌భై ఐదేళ్లుగా ఆ రోజు నేను తిరుప‌తిలో కొండ‌మీదే ఉంటూ వ‌స్తున్నా. భ‌గ‌వంతుడు కూడా అలా చేసేలా నాకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాడు. ఆ రోజు ఎంత ర‌ష్ ఉన్నా ఏదో ఓ ర‌కంగా త‌న ద‌ర్శ‌నాన్ని ఆరోజు నాకు క‌ల్పిస్తున్నాడు. వేంక‌టేశ్వ‌ర‌స్వామికి నేను ప‌ర‌మ‌భ‌క్తుడ్ని. నాకున్న‌దంతా ఆయ‌న‌దేన‌ని ఫీల‌వుతుంటా.

ఈ బ‌ర్త్‌డేకి మీరు తీసుకోబోతున్న నిర్ణ‌య‌మేంటి?

మ‌ళ్లీ తెలుగులోనే సినిమా తియ్యాల‌నుకుంటున్నాను.

లాక్‌డౌన్ పీరియ‌డ్‌లో సినిమా గురించి ఏమైనా వ‌ర్రీ అయ్యారా?

లేదండీ. మా సాంగ్ ఎంతోమందిని ఎంట‌ర్‌టైన్ చేసింద‌ని హ్యాపీ ఫీల‌య్యాను. ఆ టైమ్‌లోనే మా నీలి నీలి ఆకాశం పాట‌ను 25 కోట్ల మంది ఎంజాయ్ చేశారు. భాష‌తో నిమిత్తం లేకుండా ఆ పాట‌ను విన్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో బెంగ‌ళూరులో పోలీసులు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. వాళ్ల కోసం ఓ వీడియో సాంగ్ చేయించాను. దాంతో పాటు వాళ్లు నీలి నీలి ఆకాశం సాంగ్‌ను వింటూ రావ‌డం నేను చూశాను. ఆ పాటను వాళ్లు ఆస్వాదించార‌నే హ్యాపీనెస్ నాలో ఉంది.

ఇలాంటి పాట‌ల‌ను ఇచ్చిన అనూప్ రూబెన్స్ గురించి ఏం చెబుతారు?

ఆయ‌న‌కు హ్యాట్సాఫ్‌. ఓ క‌న్న‌డ సినిమాను ఇస్తాన‌ని ఆయ‌న‌కు ప్రామిస్ చేశాను. మా డైరెక్ట‌ర్‌, ఆయ‌నా ఆలుమ‌గ‌ల్లాగా అయిపోయారు. వాళ్లు క‌లిసి ట్రావెల్ చేస్తార‌నుకుంటున్నా.

50 శాతం ఆక్యుపెన్సీలో ఎన్ని థియేట‌ర్లు వ‌స్తాయ‌నుకుంటున్నారు?

మాగ్జిమ‌మ్ థియేట‌ర్స్ వ‌స్తాయ‌ని ఆశిస్తున్నాం. మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఎన్ని థియేట‌ర్స్ అనేది క్లారిటీ వ‌స్తుంది. వీలైన‌న్ని థియేట‌ర్ల‌లో రిలీజ్ చెయ్యాల‌ని మేం ప్లాన్ చేస్తున్నాం.

మీ దృష్టిలో సినిమాలోని హైలైట్స్ ఏమిటి?

నాకైతే క‌థ విన్న‌ప్ప‌టి కంటే సినిమా చూశాక మంచి ఫీల్ క‌లిగింది. ఇంట‌ర్వెల్ త‌ర్వాత వ‌చ్చే సెంటిమెంట్ ఆడియెన్స్ మ‌న‌సుల్ని క‌దిలిస్తుంది. యాక్ట‌ర్ల ప‌ర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. ఇక సాంగ్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా!

తెలుగు, క‌న్న‌డ ప్రేక్ష‌కుల మ‌ధ్య మీరు గ‌మ‌నించిన తేడా?

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కులు సినిమాని చాలా ఎక్కువ‌గా ప్రేమిస్తారు. క‌న్న‌డంలో అలా కాదు. ప్ర‌స్తుతం ఏ క‌న్న‌డ ప్రొడ్యూస‌ర్ కూడా ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చెయ్య‌ట్లేదు.

కేజీఎఫ్ క‌న్న‌డ సినిమా కూడా ప్యాన్ ఇమేజ్ తెచ్చుకోవ‌డం ఎలా అనిపిస్తోంది?

మా హీరోలు కూడా ఎక్క‌డికో వెళ్లిపోతున్నారంటే హ్యాపీయే క‌దా. య‌శ్ నాకు బాగా తెలుసు. వెరీ క్లోజ్ ఫ్రెండ్‌. ఆయ‌న మిసెస్ రాధికా పండిట్‌తో నేను పెద్ద సినిమాలు చేశాను. ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డి పైకొచ్చాడు. ఆయ‌న ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాం. ఇప్ప‌టివ‌ర‌కూ క‌న్న‌డ మార్కెట్ హ‌య్యెస్ట్ రూ. 60 కోట్లు.

రిలీజ్‌కు జ‌న‌వ‌రి 29 డేట్ ఎందుకు ఎంచుకున్నారు?

నీలి నీలి ఆకాశం పాట‌ను మేం 2020 జ‌న‌వ‌రి 30న రిలీజ్ చేశాం. అంటే జ‌న‌వ‌రి 29కి ఆ పాట విడుద‌లై 365 రోజుల‌న్న మాట‌. అలా విడుద‌ల తేదీ కుదిరింది. కావాల‌ని ఆ రోజును ఎంచుకోలేదు. కాక‌తాళీయంగా ఆ రోజును ఎంచుకున్నాం. మా ప్ర‌దీప్ గారే ఆరోజుకు పాట విడుద‌లై 365 రోజుల‌వుతుంద‌ని గుర్తు చేశారు. మా ప్లాన్‌కు త‌గ్గ‌ట్లు ఏదీ జ‌ర‌గ‌లేదు. త‌న‌కేం కావాలో సినిమాయే ప్లాన్ చేసుకుంటూ వ‌స్తోంది. నిజానికి ఫిబ్ర‌వ‌రి 5న రిలీజ్ చేద్దామ‌నుకున్నాం. కానీ కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల జ‌న‌వ‌రి 29కి వ‌చ్చింది.

sv babu producer interview:

30 Rojullo Preminchadam Ela Movie Producer SV Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ