బిగ్ బాస్ పార్టిసిపెంట్ మానస్ నాగులపల్లి నటించిన క్షీరసాగర మథనం చిత్రానికి అమెజాన్ లో అమేజింగ్ రెస్పాన్స్!
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో.. యువ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి తెరకెక్కించిన క్షీర సాగర మథనం చిత్రానికి అమెజాన్ లో అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 499 వ తెలుగు చిత్రంగా విడుదలైన క్షీరసాగర మథనం నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే టాప్ 25లో చోటు సంపాదించుకుని.. మరింత మెరుగైన స్థానం కోసం పోటీ పడుతోంది. శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ కి సీక్వెల్ లాంటి ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై సాఫ్ట్వేర్ వాళ్లనే కాకుండా.. సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అమెజాన్ ప్రైమ్ లో అలరిస్తోంది.
బిగ్ బాస్ ఫేమ్ మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. ఈ విజయోత్సాహంతో ఆయన తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.