దశాబ్ధాలుగా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిరంతర సేవాకార్యక్రమాల్లో ఉన్న సంగతి తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ .. ఐ బ్యాంక్ సేవలతో ఎందరో అవసరార్థులను ఆదుకుంది ఈ ట్రస్ట్. కరోనా క్రైసిస్ కష్ట కాలంలో ఆక్సిజన్ సేవల్ని ప్రారంభించి ఎందరో ప్రాణాల్ని కాపాడిన సంగతి తెలిసినదే. చేసిన సేవలకు గుర్తింపు గౌరవం దక్కుతోంది. బుధవారం నాడు గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా యోధా లైఫ్ డయాగ్నస్టిక్స్ అధినేత సుధాకర్ రూ.25 లక్షల విరాళం ట్రస్ట్ సేవల కోసం అందించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారికి కృతజ్ఞతలు తెలిపారు. చిరు మాట్లాడుతూ-ఇది ఊహించలేదు. ఎన్నో సంవత్సరాలుగా నా సొంత రిసోర్సెస్ తోనే ట్రస్ట్ ని నడిపాను. ఈ మధ్య కాలంలో కొంతమంది పెద్దలు ముందుకు వచ్చి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని గుర్తించి సముచిత ఆర్థిక సాయాన్ని అందివ్వడం ఆనంద దాయకం మీరు ఇచ్చిన ప్రతి ఒక్క పైసా అవసరార్ధులకు అందేలా చేస్తా, ఇది మీకు నా హామీ.
ఇదే సమయంలో నా వ్యక్తిగత అభ్యర్థన. మా సినీపరిశ్రమలో చాలా మంది MAA లోని పేద కళాకారులు, జూనియర్ కళాకారులు 24 క్రాఫ్ట్ లోని చిన్న టెక్నీషియన్స్ ఉన్నారు. వారంతా సరైన వైద్యం అందక ఇక్కట్లు పడుతున్నారు. మీ డయాగ్నసిస్ సెంటర్ ద్వారా రోగ నిర్ధారణ పరిష్కారానికి గాను వారికి సాయం చేస్తారని ఆశిస్తున్నానుఅని అన్నారు.
దానికి ప్రతిస్పందనగా.. మూవీ ఆర్టిస్టుల సంఘంతో సహా 24 శాఖల కార్మికులకు 50 శాతం తక్కువ ఖర్చులోనే ఆరోగ్య సేవలందిస్తామని యోధ లైఫ్ లైన్ సుధాకర్ అన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ట్విట్టర్ లోనూ ప్రశంసలు కురిపించారు. ఇలాంటివి సమాజానికి మంచి సంజ్ఞల్ని ఇస్తాయి. ఎక్కువ మందికి సేవ చేయడం .. వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో మాకు సహాయపడతాయి. హైదరాబాద్ లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్స్ వ్యవస్థాపకుడు సుధాకర్ కంచర్ల గారికి హృదయపూర్వక అభినందనలు... అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.