జీ 5.. ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఒక్క జానర్‌కు పరిమితం కాకుండా... అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్ మూవీస్ మరియు వెబ్ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకుంటోంది. ఇటీవలి కాలంలో డైరెక్టర్ కామెంటరీతో రిపబ్లిక్ సినిమాను విడుదల చేసింది. ప్రజల్ని చైతన్యపరిచే కథతో రూపొందిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అంతే కాకుండా మధ్య తరగతి కుటుంబ నేపథ్యంతో జీ 5 విడుదల చేసిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ తండ్రీకొడుకుల అనుబంధాన్ని, కుటంబ బంధాలను ఆవిష్కరించి అశేష ప్రజాదరణను పొందింది. ఇప్పుడు మరో కొత్త ఒరిజినల్ సిరీస్ నిర్మాణానికి జీ 5 శ్రీకారం చుట్టింది.
బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి గాలివాన అనే ఒరిజినల్ సిరీస్ గా నిర్మిస్తోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. 50 ఏళ్ళ క్రితం మొదలయిన తన కెరీర్ లో సాయి కుమార్ బాలనటుడిగా, హీరోగా, ప్రధాన పాత్రధారిగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. అలాగే, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్, ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి.
ఇటీవలే ఈ ఒరిజినల్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేసాం. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ షోను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కించడం ఇదే తొలిసారి. ఈ వెబ్ సిరీస్‌తో బిబిసి రీజనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది అని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, జీ 5 సంస్థలు తెలిపాయి. తిమ్మరుసు ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.