మంచి కథ లభిస్తే మహేష్ తో నటించాలనుంది - సుధీర్ బాబు
సుధీర్ బాబు నటుడిగా పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. అతని మొదటి చిత్రం శివ మనసులో శృతి 10 ఫిబ్రవరి 2012న విడుదలైంది. రేపటికి ఆయన సినిమాలోకి వచ్చి పదేళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో తన సినీ జర్నీని పంచుకున్నారు.
- నేను చేసిన సినిమాల సంఖ్య, పొందిన అభిమానుల సంఖ్య కంటే నటుడిగా నేను సంపాదించిన గౌరవమే ముఖ్యం. నటుడిగా వందశాతం కష్టపడ్డాను. ఆ సంతృప్తి నాకు వుంది.
- నా కెరీర్లో వైఫల్యాలు నాకు విలువైన పాఠాలు నేర్పాయి. స్క్రిప్ట్‌లను ఎలా ఎంచుకోవాలో నేర్చుకున్నాను. కథతో పాటు బడ్జెట్లు, టెక్నికల్ టీమ్‌ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గ్రహించాను.
- ఇన్నేళ్ళ కెరీర్ వుంటుందని రాలేదు. సినిమాపై తపనతోనే వచ్చాను. నేను నా హార్డ్ వర్క్‌ను నమ్ముతాను.
- మా నాన్న బిజినెస్ చూసుకోమన్నారు. నాకంటూ గుర్తింపు, గౌరవం వుండాలనే ఏకైక లక్ష్యంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలు ఎంపికలు చేసుకుంటూ ముందుకు సాగాను.
- నాకు యాక్షన్ చిత్రాలంటే ఇష్టం. జాకీచాన్‌కి పెద్ద అభిమానిని. బెంచ్ మార్క్ యాక్షన్ సినిమాలు చేయబోతున్నాను. నటుడు-రచయిత-దర్శకుడు హర్షవర్ధన్‌తో ఓ సినిమా చేస్తాను. వెబ్ సిరీస్ లూజర్ 2 దర్శకుడు నాతో ఓ సినిమా చేయనున్నాడు.
- కొత్త జోనర్లను ప్రయత్నించాలని సమ్మోహనం, ప్రేమ కథా చిత్రమ్ చేశాను. నేను హీరోగా ప్రారంభించాను కానీ నటుడిగా కూడా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే హిందీలో బాఘీ ఆఫర్ వస్తే విలన్‌గా చేశాను, బ్రహ్మాస్త్ర లోనూ నటించా.
- కెరీర్ పరంగా కృష్ణగారు, మహేష్ నుంచి చాలా నేర్చుకున్నా. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పని నుండి ఎలా స్విచ్ ఆఫ్ అవ్వాలో కృష్ణగారు నుండి నేర్చుకున్నాను. ప్రేమ కథా చిత్రమ్ విడుదలైనప్పుడు మహేష్ నన్ను మెచ్చుకున్నారు.
- గత పదేళ్లలో నేనెప్పుడూ మహేష్‌ని ఏ ఫేవర్ కోసం సంప్రదించలేదు. అది నేను పాటిస్తున్న సూత్రం. మంచి కథ దొరికితే మహేష్‌తో నటించాలనేది నా కోరిక.
- సినిమాల్లోకి రాకముందు బ్యాడ్మింటన్ ఆడాను. పుల్లెల గోపీచంద్ బయోపిక్ తెరకెక్కుతోంది. పెద్ద సంస్థ ముందుకు వచ్చింది. త్వరలో సెట్ పైకి వెళ్ళబోతోంది.
- స్టార్ డైరెక్టర్స్ అందరితోనూ కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. కానీ కొత్త దర్శకులతో పనిచేయడం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చకునే అవకాశం వుంటుంది.
- నా పిల్లలు కూడా బాలనటులుగా చేస్తున్నారు. వారి అభిరుచి మేరకు ఏ రంగంలో వుంటారనేది ముందు ముందు తెలుస్తుంది.
- నా బెస్ట్ క్రిటిక్ నా భార్యే. స్నేహితులుకూడా కొన్ని సూచనలు చేస్తుంటారు. మీడియాలోనూ కొందరు వున్నారు.