తెలుగువారి ఆరాధ్య నటుడు, మహా పురుషుడు ఎన్. టి. రామారావు గారి శత జయంతి వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం, ఆయన పట్ల ప్రజల హృదయాల్లో చెక్కు చెదరని అభిమానానికి నిదర్శనమని చెప్పవచ్చు. అన్నగారి శత జయంతి వేడుకల్లో మా కమిటీ భాగస్వామి కావడం, వారి స్ఫూర్తి ఎప్పటికీ ఉండేలా కార్యక్రమాలను చేయడం అదృష్టంగా భావిస్తున్నాము.
మేము ఏ ముహూర్తాన అన్నగారి శత జయంతి వేడుకలు తలపెట్టామో, అవి నిర్విఘ్నంగా, నిరాటంకంగా మన దేశంలోనే కాదు అమెరికాతో పాటు మిగతా దేశాల్లో జరగడం అన్న గారు దైవంశసంభూతుడని రుజువు చేశాయి.
అన్నగారి ఉపన్యాసాలను, శాసన సభ ప్రసంగాలు, చారిత్రిక ప్రసంగాలు పేరుతో రెండు గ్రంధాలను ప్రచురించాము. ఆ పుస్తకాలను విజయవాడ లో జరిగిన సభలో విడుదల చేశాము. ఆ సభతో మా కమిటీ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.
తరువాత అన్నగారి సినిమా, రాజకీయ ప్రస్థానం, వారి అనుభవాలు, వారితో ప్రముఖుల జ్ఞాపకాలతో శకపురుషుడు అనే ప్రత్యేక సంచిక మరియు jaintr వెబ్ సైట్ ను హైదరాబాద్ సభలో ఆవిష్కరించాము. అన్నగారి వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని అక్షరబద్దం చేసిన మా కమిటీ కృషిని మెచ్చనివారు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే 23వ తానా నుంచి మాకు ప్రత్యేక ఆహ్వానం రావడం.
ఈ నెల 7, 8, 9వ తేదీల్లో అమెరికాలోని ఫిలడెల్ఫియా లో జరిగిన తానా వేడుకల్లో శకపురుషుడు ఎన్. టి. ఆర్. కు అపూర్వమైన, అనూహ్యమైన ఘన నివాళులు అర్పించారు. తానా సభల్లో ప్రత్యేక ఆకర్షణగా నందమూరి బాలకృష్ణ నిలిచారు. తానా నిర్వాహకులు ఏర్పాటుచేసిన శకపురుషుడు కళాప్రాంగణానికి బాలకృష్ణ గారు ప్రారంభోత్సవం చేశారు.
మేము ప్రచురించిన శకపురుషుడు ప్రత్యేక సంచికను అక్కడకు విచ్చేసిన ప్రముఖులకు బహుకరించాము. అదే సభలో మా కమిటీ రూపొందించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. ఆ వీడియోను చూసిన ఆహుతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదే సభలో మేము చేపట్టబోతున్న అన్నగారి 100 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్టించాలని సంకల్పతో ఉన్నామని నేను ప్రకటించగానే, ఈ బృహత్ కార్యక్రమంలో తాము భాగస్వాములమవుతామని చెప్పడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది, ముందుకు పోవడానికి ధైర్యాన్ని ఇచ్చింది. అమెరికాలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు తమ రాష్ట్రానికి ఆహ్వానించి, అక్కడ అన్నగారి జయంతి ఉత్సవాలు నిర్వహించి, అన్న గారి విగ్రహ ఏర్పాటు చాలా మంచి ఆలోచనని, అందుకు తామందరం సహకరిస్తామని, అన్న గారు 1983లో ముఖ్యమంత్రి అయిన తరువాత మాతృ భూమి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారని, ఆ నినాదం స్ఫూర్తిగా అన్న ఎన్. టి. రామారావు స్మృతి ని తరతరాలను నిలుపుదామని చెప్పడం, మాకు మహదానందాన్ని కలిగించింది.
అమెరికాలో కనెక్ట్ కట్, న్యూ జెర్సీ, అట్లాంటా, ఉత్తర కెర్లినా రాష్ర్టంలో చార్లెట్, డాలస్, లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలో శానోజి, సక్రిమెంటో నగరాలలో అన్నగారి శత జయంతి వేడుకలను అక్కడి స్థానిక అన్నగారి అభిమానులు అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఆ సభల్లో మా కార్య క్రమాలు, మా కమిటీ నిరంతర కృషిని వివరించాను. అన్నిచోట్లా ఊహించని స్పందన వచ్చింది. అన్నగారి విగ్రహాన్ని నెలకొల్పడంలో మమల్ని భగస్వాములను చెయ్యమని వారందరూ కోరారు.
మాకు సహకరిస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, నందమూరి రామకృష్ణ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాము. మా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెన్ను దన్నుగా వున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.