సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం వేట్టైయాన్. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. సామాజిక పరమైన సమస్యలను తెలియజేసేలా సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలను అందుకున్న దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియ మూవీ ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది.
బ్లాక్ బస్టర్ చిత్రాలు 2.0, దర్బార్, లాల్ సలామ్ వంటి చిత్రాల తర్వాత రజినీకాంత్, లైకా ప్రొడక్షన్ష్ కలయికలో రాబోతున్న నాలుగో సినిమా వేట్టైయాన్. అలాగే పేట, దర్బార్, జైలర్ చిత్రాల తర్వాత రజినీకాంత్, రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ కలయికలోనూ రానున్న నాలుగో సినిమా కూడా ఇదే కావటం విశేషం.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే అంధాకానూన్, గిరఫ్తార్, హమ్ సినిమాల తర్వాత రజినీకాంత్, అమితాబ్ కలిసి నటిస్తోన్న నాలుగో సినిమా ఇది. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషరా విజయన్, రోహిణి, అభిరామి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.