ఫిలిం జర్నలిస్టుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణా ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ సచివాలయంలో మంత్రిని కలసి అభినందనలు, నూతన సంవస్తర శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులతో మాట్లాడిన మంత్రి తలసాని ఫిలిం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఫిలిం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి స్తాయిలో చర్చ చేసి అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. సినిమా పరిశ్రమను తెలంగాణాలో అభివృద్ధి చెయ్యడానికి ముఖ్యమంత్రి కె.చంద్ర శేకర్ రావు ఇప్పటికే రెండు వేల ఎకరాల స్తలాన్ని కేటాయించారని అన్నారు. దీని ద్వారా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని చెప్పారు. మంత్రిని కలసిన వారిలో తెలంగాణా ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.లక్ష్మి నారాయణ , ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మి నారాయణ, సంయుక్త కార్యదర్శి చిన్నమూల రమేష్, సభ్యులు సాయి రమేష్, పొన్నం శ్రీనివాస్, సురేష్ కొండి, తదితరులు ఉన్నారు.