శంకర్ - విక్రమ్ ల 'ఐ' చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది. అయితే ఈ సినిమా విడుదలకాకముందే ఈ చిత్రం స్టొరీలైన్, కాన్సెప్ట్ లు లీక్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో విక్రమ్ బాడీబిల్డర్ లింగేశం పాత్రలో, యాడ్ ఫిల్మ్ మోడల్ లీ పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపధ్యంలో సాగుతుందని సమాచారం. ఈ నేపధ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని శంకర్ 'ఐ' చిత్రాన్ని ఓ రేంజ్ లో తెరపై ఆవిష్కరించాడని తెలుస్తోంది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్స్ లో బంగారు పతకం ఎలా సాధించాడనేది ఈ చిత్రం కథ అని వినిపిస్తోంది. అయితే సినిమా స్టొరీలైన్, కాన్సెప్ట్ బయటకు రావడానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన పి.సి.శ్రీరామ్ కారణం అనే వదంతులు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పొరపాటున ఆయన బయట పెట్టాడని అంటున్నారు. అయినా దీని వల్ల సినిమా కు పెద్ద సమస్య ఏమి ఉండదని అంటున్నారు యూనిట్ సభ్యులు. ఈ విజువల్ వండర్ ను మెగాసూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే పి.సి.శ్రీరామ్ పొరపాటుగా స్టొరీలైన్ చెప్పాడా? లేక అందరి చూపును మరల్చడానికి రూమర్ ను వదిలాడా? అనేది కొన్ని రోజుల్లో తేలుతుంది.