తమిళస్టార్ హీరో సూర్యను పెళ్లాడిన తర్వాత నుండి సినిమాలకు దూరంగా ఉంటున్న జ్యోతిక చాలాకాలం తర్వాత మరలా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళు ఆమె ఇద్దరు పిల్లల పెంపకంలో మునిగిపోయింది. ఇప్పుడు పిల్లలు కాస్త పెద్దవారు కావడం, భర్త అంగీకారం కూడా ఉండటంతో మళ్ళీ ఆమె సినిమాలపై దృష్టి సారించింది. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'హౌ ఓల్డ్ ఆర్ యు' చిత్రం తనకు సరిపోయే విధంగా ఉండటంతో దాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తోంది. ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త సూర్య స్వయంగా తన సొంత బ్యానర్ 2డి పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లో జ్యోతిక సరసన రఘు నటిస్తున్నాడు. సాధారణంగా జ్యోతికకు షెడ్యూల్, షెడ్యూల్ కు మధ్య గ్యాప్ తీసుకోవడం మొదటి నుండి అలవాటు. గతంలో ఆమె సినిమాల్లో నటించేటప్పుడు కూడా అదే విధానాన్ని ఫాలో అయింది. అయితే ఇప్పుడు మాత్రం జ్యోతిక పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తోంది. అసలు గ్యాప్ తీసుకోవం లేదు. క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది. తన సొంత బ్యానర్ లో సినిమా కావడంతో సినిమా బడ్జెట్ పెరిగితే నష్టపోయేది తామే కావడంతో జ్యోతిక చాలా కష్టపడి తొందరగా షూటింగ్ పూర్తికావడానికి సహకారం అందిస్తోంది. దీన్ని బట్టి జ్యోతికకు భర్త అంటే భయంతో పాటు భక్తి కూడా ఉందని కోలీవుడ్ వాసులు సెటైర్లు వేస్తున్నారు.